– పదే పదే అబద్దాలు చెబుతున్నారు : ఉత్తమ్, కోమటిరెడ్డి విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో పదే పదే అబద్దాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపడం సరికాదని వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు బీఎల్‌ఆర్ బాలునాయక్, జయవీర్‌రెడ్డి తదితరులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ అబద్దాలు చెప్పినా,మంత్రులుగా నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని అభిప్రాయపడ్డారు. పదేండ్లల్లో కేవలం భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను మాత్రమే ప్రారంబించి పూర్తిచేశారని అన్నారు. అది కూడా నాసిరకంగా ఉందని ఆరోపించారు. విద్యుత్ విషయంలో ఏడు వేల మెగావాట్ల నుంచి 12 వేల మెగావాట్లకు పెంచామని చెప్పడం పచ్చిఅబద్దమని చెప్పారు. కాళేశ్వరంకు రిపేర్ చేయిస్తారని కేసీఆర్ అన్నాడనీ, అది ఆయన హయాంలోనే నాశనమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.95 వేల కోట్లు ఖర్చు చేశారనీ, ఇంకా డబ్బు కావాలని అన్నారు. మేడిగడ్డ 2023 అక్టోబరు 21న కుంగిందనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది డిసెంబరు ఏడున అని గుర్తు చేశారు. కుంగిన 45 రోజులకుగానీ కేసీఆర్ నోరు మెదపలేదని చెప్పారు. ప్రాజెక్టు కుంగిన తర్వాత నీళ్లు వదిలింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేననీ, కానీ మాపై నెపం నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 104 ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయారని వివరించారు. అందులో నుంచి 25 మంది కాంగ్రెస్‌లోకి వస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ్ల బీఆర్‌ఎస్ ఒక్క ఎంసీ సీటునూ గెలవలేదని అన్నారు. కృష్ణాజలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా 811 టీఎంసీలలో ఉంటే, రాష్ట్ర విభజన తర్వాత 299 టీఎంసీలకు ఒప్పుకుని తెలంగాణకు తీరని అన్యాయం చేశారని వివరించారు. కేసీఆర్ ఒప్పందంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో 7031 వరి కొనుగోలు కేంద్రాలు పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం 7200 కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గతేడాది కంటే 15 రోజుల ముందే కొనుగోళ్లు ప్రారంభించినట్టు వివరించారు. ఈ సందర్భంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ విమర్శలకు పాయింట్ల వారీగా మంత్రులు మీడియాకు వివరణ ఇచ్చారు.