చేతివృత్తులకు కేసీఆర్‌ చేయూత

– వృత్తికులాల కార్పొరేషన్లు, ఫెడరేషన్ల చైర్మెన్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అన్ని రకాలుగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఎన్నడూ లేనివిధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వృత్తి కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు చైర్మెన్లు అభిప్రాయపడ్డారు. శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చైర్మెన్‌ డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ ముదిరాజ్‌, కల్లుగీత కార్పొరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌ గౌడ్‌, టెక్స్‌టైల్‌ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ గూడూరి ప్రవీణ్‌ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన చేతివృత్తుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న సహాయ సహకారాల ఫలితంగా రాష్ట్రంలో లక్షలాదిమంది చేతివృత్తుల ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను లబ్ధిదారులకు సరైన రీతిలో అందేలా వృత్తి కులాలకు చెందిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, వాటి ఫలితంగా అనుభవంలోకి వస్తున్న ఫలితాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. వెనుకబడిన తరగతులతో పాటుగా అందులో భాగమైన అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని, అమలుపరుస్తున్న పథకాలని ఇంటింటికి చేరవేసేందుకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలతోపాటుగా దళిత, మైనారిటీ, గిరిజన, ఆదివాసి, మహిళ, వికలాంగుల అభ్యున్నతి కోసం గడచిన తొమ్మిదేండ్లుగా పనిచేస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు.