– కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్
– నిడమనూరు ఆదర్శ పాఠశాలలో ఘటన : బాలికలతో ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి భేటీ
నవతెలంగాణ – నిడమనూరు
గురువుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల కీచకుడిగా మారాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు కేంద్రంలోని ఆదర్శపాఠశాలలో శనివారం వెలుగుచూసింది. తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సోషల్ టీచర్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తాకరాని చోట తాకుతూ ఇబ్బంది పెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. టీచర్ నిర్వాకం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు వచ్చిన ఆ ఉపాధ్యాయున్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ నిర్మలను వివరణ కోరగా, విద్యార్థినులు చెప్పిన వివరాలపై ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి చర్చించామని, ప్రతి ఉపాధ్యాయుడూ జాగ్రత్తలు పాటించాలని సూచించామని తెలిపారు.
విద్యార్థినులతో ఎమ్మెల్యే జయవీర్ భేటీ
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి వెంటనే పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపించి తగిన ఆధారాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠిని ఫోన్‌లో కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయున్ని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించాలని, ఆరోపణలు నిజమైనట్టు తేలితే కఠిన చర్యలకు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి హామీ మేరకు తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.