కీచక ప్రిన్సిపాల్‌ నిన్న జింద్‌.. నేడు కైతాల్‌

– లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడు
– పాఠశాల విద్యార్థినుల ఆరోపణలు
– హర్యానాలో మరో ఘటన
చండీగఢ్‌ : బీజేపీ పాలిత హర్యానాలో పాఠశాలల్లో విద్యార్థినుల కు భద్రత కరువైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో వరుసగా నమోదవుతున్న లైంగిక వేధింపుల ఘటనలే ఇందుకు నిదర్శనం. కైతాల్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. జిల్లాలో గల ఒక గ్రామంలోని ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాలలో ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు డిసెంబర్‌ 4న లైంగిక వేధింపుల కేసును నివేదిం చారు. బాలికలు తమ మౌనాన్ని వీడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి రవి కుమార్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వేధింపులు చాలా రోజులుగా కొనసాగాయనీ, దాని గురించి మాట్లాడితే ప్రిన్సిపాల్‌ తమను బెదిరించేవాడని బాలికలు తమ ఫిర్యాదులో ఆరోపించారు. కాగా, పాఠశాల ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పాఠశాల అధికారులు కొన్ని పనుల కోసం నియమించిన నిర్మాణ కాంట్రాక్టర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కాంట్రాక్టర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ”కాంట్రాక్టర్‌, ప్రిన్సిపాల్‌ కలిసి మధ్యాహ్న భోజనం చేస్తే వారికి మధ్యాహ్న భోజనం, నీళ్లు అందిం చాలని ఒత్తిడి చేశారు. కాంట్రాక్టర్‌ ఎటువంటి కారణం లేకుండా తరచుగా మా తరగతి గదులకు వచ్చేవాడు. వేధింపులు చాలా రోజులు గా కొనసాగాయి” అని బాలికలు తమ ఫిర్యాదులో ఆరోపించారు. మేజిస్ట్రేటు ముందు ఇద్దరు విద్యార్థుల వాంగ్మూలా ల తర్వాత, ఈ కేసులో కాంట్రాక్టర్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్‌ 10 కింద, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారి వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామనీ, దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.
హర్యానాలోని జింద్‌ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌పై గత నెలలో 142 మంది విద్యార్థినులు శారీరక, మానసిక హింసకు సంబంధించిన సాక్ష్యాలను అందించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని రోజుల వ్యవధిలోనే తాజా ఘటన చోటు చేసుకోవటంపై సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, బాలికలు, విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించాలనీ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.