– 3-0 విజయంపై రోహిత్‌సేన గురి
– అఫ్గాన్‌తో భారత్ మూడో టీ20 నేడు
– రాత్రి 7 నుంచి జియో సినిమాలో..
నవతెలంగాణ-బెంగళూర్ : 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట టీమ్ ఇండియా ఆడే చివరి టీ20. అతిపెద్ద టీ20 లీగ్ ఐపీఎల్ ముంగిట భారత్‌లో జరుగనున్న చివరి టీ20 సైతం ఇదే. టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పు, జట్టు ఎంపికపై ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. కానీ, టీమ్ ఇండియా విజయ పరంపర మాత్రం కొనసాగుతోంది. గతంలోనూ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దంచికొట్టిన కుర్రాళ్లను కాదని.. సీనియర్లను జట్టులోకి తీసుకుని తగిన మూల్యం చెల్లించుకున్న చరిత్ర బీసీసీఐ సొంతం. ఇప్పుడూ అదే దారిలో నడుస్తుందా? సరికొత్తగా ఆలోచన చేస్తుందా? చూడాలి. అఫ్గాన్‌తో తొలి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్.. మూడు మ్యాచుల సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. చిన్న బౌండరీల చిన్నస్వామి స్టేడియం పరుగుల వరదకు చిరునామా. భారీ స్కోర్లు నమోదయ్యే వేదికపై 3-0తో సిరీస్ సాధించాలని ఆతిథ్య భారత్.. కనీసం ఊరట విజయమైనా దక్కించుకోవాలని అఫ్గనిస్థాన్ ఎదురుచూస్తున్నాయి. భారత్, అఫ్గనిస్థాన్ మూడో టీ20 నేడు.
సీనియర్లకు సవాల్: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కొత్త నిరూపించుకునేందుకు ఏమీ లేదు. మూడు ఫార్మాట్లలో మేటి బ్యాటర్లు ఇద్దరూ ప్రశంసలు అందుకున్నారు. కానీ టీ20ల్లో మాత్రం కోహ్లి, రోహిత్ భిన్నమైన స్థితి ఎదుర్కొంటున్నారు. సుమారు 14 నెలల విరామం అనంతరం పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేసిన ఈ ఇద్దరు సీనియర్లు టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ రీ ఎంట్రీలో రోహిత్ శర్మ వరుస మ్యాచుల్లో సున్నా పరుగులకే వికెట్ కోల్పోయాడు. విరాట్ కోహ్లి ఇండోర్‌లో మెప్పించినా.. భారీ స్కోరు సాధించలేదు. ఓ వైపు కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, శివం దూబె, జితేశ్ శర్మ, రింకూ సింగ్‌లు నిలకడగా విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడేస్తున్నారు. దీంతో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఈ ఫార్మాట్‌లో సమయానుకూల ప్రభావశీల ఇన్నింగ్స్ బాకీ పడ్డారు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు అందుబాటులోకి వస్తే మిడిల్ ఆర్డర్‌లో చోటు అంత సులువు కాదు. ఇది పరోక్షంగా విరాట్ కోహ్లిపై ఒత్తిడి పెంచుతుంది. ఐపీఎల్ ముంగిట చివరి టీ20లో సత్తా చాటాలని ఇద్దరూ ఆశిస్తున్నారు. ఐపీఎల్ సొంత మైదానం బెంగళూర్‌లో మ్యాచ్ కావటంతో కోహ్లిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా శివం దూబె ప్రదర్శన జట్టు మేనేజ్‌మెంట్‌కు సరికొత్త భరోసా అందిస్తోంది. బంతితో అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్‌లు బాగా రాణిస్తున్నారు. స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్ మాయలో మెప్పిస్తున్నాడు. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్ నేడు చిన్నస్వామిలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.