– రాత్రి 7 నుంచి డిడి స్పోర్ట్స్‌లో
– 2-0 పై రోహిత్‌సేన గురి
– కరీబియన్ శిబిరంలో సమం ఆశలు
– విండీస్‌తో భారత్ రెండో వన్డే నేడు
వన్డే సిరీస్‌పై టీమ్ ఇండియా కన్నేసింది. స్పిన్ మాయతో తొలి వన్డేలో ఏకపక్ష విజయం నమోదు చేసిన రోహిత్‌సేన.. నేడు కరీబియన్లపై మరో విజయంతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు దూరమైన వెస్టిండీస్‌కు సిరీస్‌లో ఎటువంటి ప్రేరణ కనిపించటం లేదు. ఐపీఎల్ ప్రాంఛైజీలను ఆకర్షించేందుకైనా.. కరీబియన్ కుర్రాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తారేమో చూడాలి. భారత్, వెస్టిండీస్ రెండో వన్డే పోరు నేడు.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్
కుర్రాళ్లకు అవకాశం
2023 ప్రపంచకప్ సన్నద్ధతకు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఉపకరిస్తుందని భావించినా.. పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవు. ఆధునిక క్రికెట్ ప్రమాణాలను కరీబియన్లు ఏమాత్రం అందుకోలేకపోతున్నారు. విండీస్‌తో వన్డే సిరీస్ ప్రదర్శన, ఫలితాలు రోహిత్‌సేనకు పెద్దగా ఉపకరించే అవకాశం కనిపించటం లేదు. దీంతో కరీబియన్లతో వన్డే సమరంలో యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. తొలి వన్డేలోనూ రోహిత్, ద్రవిడ్ ద్వయం ఇదే ఫార్ములా పాటించింది. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా ముందుకొచ్చారు. ఈ ఫార్మాట్‌లో నిలకడ సాధించని సూర్యకుమార్ యాదవ్ మళ్లీ విరాట్ కంటే ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫామ్‌లో లేని, అవకాశాలు లభించని క్రికెటర్లకు విండీస్‌తో సిరీస్‌లో చాన్స్ ఇవ్వాలని రోహిత్ భావిస్తున్నాడు. భారత జట్టును ఢకొీట్టే సత్తా, సామర్థ్యం కరీబియన్ శిబిరంలో కనిపించటం లేదు. పేసర్ మహ్మద్ సిరాజ్ దూరమైనా.. తొలి వన్డేలో మనోళ్లు మెరుగ్గా రాణించారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా జోడీ మరోసారి కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నేటి మ్యాచ్‌లోనూ చివరగా బ్యాటింగ్‌కు వచ్చే వీలుంది. ఇషాన్ కిషన్ అర్థ సెంచరీతో రాణించటంతో సంజు శాంసన్‌కు అవకాశం దక్కటం కష్టమే.
కాస్త పోటీ ఇస్తారా?
కరీబియన్ క్రికెట్ తిరోగమనంలో పయనిస్తోంది. టెస్టుల్లో ప్రాధాన్యత కోల్పోయిన విండీస్.. తాజాగా 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ దారుణ స్థితికి చేరుకుంది. ప్రతిభావంతులైన కుర్రాళ్లు జట్టులో నిలిచినా.. జట్టుగా కరీబియన్లకు ఓ ప్రేరణ లేకుండా పోయింది. బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అతానేజ్, హోప్, పావెల్, షెఫార్డ్‌లు ఇప్పటికే సత్తా చాటిన క్రికెటర్లు. ప్రాంఛైజీ క్రికెట్‌లో దుమ్మురేపిన రికార్డుంది. కానీ జట్టుగా వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు.. అంచనాలను అందుకోలేకపోతున్నారు. తొలి వన్డేలోనూ ఓ దశలో మెరుగ్గానే ఆడినా.. స్పిన్ మాయకు విలవిల్లాడారు. సిరీస్ చేజార్చుకునే ప్రమాదం నేపథ్యంలో కరీబియన్ కుర్రాళ్లు కనీస పోటీ ఇవ్వటంపైనా ఫోకస్ పెడతారా? చూడాలి.
పిచ్, వాతావరణం
కెన్సింగ్టన్ ఓవల్ తొలి వన్డేలో స్పిన్‌కు గొప్పగా సహకరించింది. సహజసిద్ధంగా ఇక్కడ పేసర్లకు వికెట్ పడగొట్టే అవకాశాలు అధికం. మణికట్టు స్పిన్‌కు అనుకూలత కనిపించినా.. తొలి వన్డేలో బంతి మరీ ఎక్కువ తిరిగింది!. నేడు రెండో వన్డేకు వర్షం సూచనలు కనిపిస్తున్నాయి. 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. తొలి వన్డేలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 50 ఓవర్ల ఆట సాగలేదు. మరి రెండో వన్డేలోనైనా వంద ఓవర్ల ఆట చూస్తామా? ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
వెస్టిండీస్ : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అతానేజ్, షారు హోప్, షిమ్రోన్ హెట్‌మయర్, రోవ్‌మాన్ పావెల్, రోమారియో షెఫార్డ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్, మోతీ, జేడేన్ సీల్స్.