సిరీస్‌పై కన్నేసి..

Looking at the series..– 3-1 విజయంపై భారత్‌ గురి
– సమంపై సఫారీ సేన ఆశలు
– భారత్‌, దక్షిణాఫ్రికా నాల్గో టీ20 నేడు
– రాత్రి 8.30 నుంచి స్పోర్ట్స్‌18లో..
టీ20 సిరీస్‌పై భారత్‌ కన్నేసింది. ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌ దక్షిణాఫ్రికాపై మరోసారి పంజా విసిరేందుకు రంగం సిద్ధం చేసింది. నాలుగు మ్యాచుల సిరీస్‌లో 2-1తో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీమ్‌ ఇండియా.. నేడు చివరి మ్యాచ్‌లో నెగ్గి ట్రోఫీ దక్కించుకోవాలని చూస్తుంది. బ్యాటింగ్‌ స్వర్గధామం వాండరర్స్‌లో పరుగుల వరద పారించి సిరీస్‌ను సమం చేసేందుకు ఆతిథ్య దక్షిణాఫ్రికా ఎదురుచూస్తుంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతుండగా.. జొహనెస్‌బర్గ్‌లో నేడు అమీతుమీ ఖాయం. భారత్‌, దక్షిణాఫ్రికా చివరి టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-జొహనెస్‌బర్గ్‌
భారత్‌, దక్షిణాఫ్రికా పొట్టి ఫార్మాట్‌ సవాల్‌ ఆఖరు అంకానికి చేరుకుంది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌లు నేడు చివరి టీ20 పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం అయ్యింది. 3-1తో సిరీస్‌ విజయమే లక్ష్యంగా టీమ్‌ ఇండియా సమరానికి సై అంటోంది. మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-2తో సొంతగడ్డపై సిరీస్‌ను సమం చేసి సమంగా పంచుకోవాలనే సంకల్పంతో కనిపిస్తోంది. సఫారీ టాప్‌ ఆర్డర్‌లో దూకుడు లోపించినా.. లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ అసమాన ప్రదర్శనలతో అదరగొడుతోంది. సిరీస్‌ ఫలితాన్ని శాసించేందుకు ఇరు జట్లు నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
బ్యాటర్లపైనే ఫోకస్‌
భారత్‌ వరుసగా భారీ స్కోర్లు సాధిస్తున్నా.. బ్యాటింగ్‌ సమస్య వేధిస్తూనే ఉంది. టాప్‌ ఆర్డర్‌లో ఒకరిద్దరు మెరవటంతోనే టీమ్‌ ఇండియా గట్టెక్కుతోంది. కానీ బ్యాటర్లు సమిష్టిగా రాణించటం లేదు. వరుస మ్యాచుల్లో శతకాలు బాదిన సంజు శాంసన్‌.. ఆ తర్వాత వరుస మ్యాచుల్లో సున్నా పరుగులకే అవుటయ్యాడు. నిలకడగా నిరాశపరిచిన అభిషేక్‌ శర్మ గత మ్యాచ్‌లో అర్థ సెంచరీతో పుంజుకున్నాడు. నేడు ఓపెనర్లు ఇద్దరూ కదం తొక్కాల్సిన అవసరం ఉంది. మిడిల్‌ ఆర్డర్‌లో తిలక్‌ వర్మ ఫామ్‌ అందుకోవటం శుభ సూచకం. కానీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు. హార్దిక్‌ పాండ్య, రింకు సింగ్‌లు సఫారీ బౌలర్ల ముంగిట తేలిపోతున్నారు. ఈ ముగ్గురు పరుగుల వేటలో దూకుడు, ఫామ్‌ చూపించాల్సి ఉంది. యువ ఆటగాడు రమణ్‌దీప్‌ సింగ్‌ ఆకట్టుకున్నాడు. అతడికి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ లభించే అవకాశం లేకపోలేదు. వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోరులు సఫారీ బ్యాటర్ల కోసం సరికొత్త వ్యూహం రచించాల్సిందే. అర్షదీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్య పేస్‌ బాధ్యతలు తీసుకున్నారు. అర్షదీప్‌ డెత్‌ ఓవర్లలో పరుగుల నియంత్రణపై దృష్టి పెట్టాలి. అప్పుడే, ఆఖర్లో అతడిపై జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్మకంగా ఉండగలదు.
పట్టుదలగా సఫారీలు
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పట్టుదలగా కనిపిస్తున్నారు. భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రణాళికలతో ముందుకొస్తున్నారు. సెంచూరియన్‌లో వరుణ్‌ చక్రవర్తిని టార్గెట్‌ చేసిన మార్‌క్రామ్‌, క్లాసెన్‌లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఆఖర్లో మార్కో జాన్సెన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో భారత్‌పై అమాంతం ఒత్తిడి పెంచాడు. టాప్‌ ఆర్డర్‌ శుభారంభం అందిస్తే మిడిల్‌, లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ లాంఛనం ముగించగలదు. డెవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌లు సఫారీలకు కీలకం. యువ బ్యాటర్లు రికెల్టన్‌, హెండ్రిక్స్‌లు జట్టులో స్థానానికి న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కోయేట్జి, జాన్సెన్‌ బ్యాట్‌తో ధనాధన్‌ మోత మోగించటం ఆతిథ్య జట్టుకు అదనపు బలం. స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ ఆశించిన మాయ చేయటం లేదు. బంతితో కోయేట్జి, జాన్సెన్‌ ప్రభావం చూపిస్తున్నా.. మరో ఎండ్‌లో ఒత్తిడి పెంచే బౌలర్‌ లేకుండా పోయాడు. వరుస వైఫల్యాల నుంచి బయటపడేందుకు కసిగా ఎదురుచూస్తున్న ఎడెన్‌ మార్‌క్రామ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌లు నేటి మ్యాచ్‌లో ప్రమాదకరంగా మారే అవకాశాలు లేకపోలేదు. గత మ్యాచ్‌లో ఫామ్‌ అందుకునే ప్రయత్నం చేసిన ఈ ఇద్దరు స్టార్‌ బ్యాటర్లు.. వాండరర్స్‌లో పరుగుల వేట మొదలెడితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.
పిచ్‌, వాతావరణం
జొహనెస్‌బర్గ్‌ వాండరర్స్‌ స్టేడియం సంప్రదాయ బ్యాటింగ్‌ పిచ్‌. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 173 కాగా, శ్రీలంక 260 పరుగుల అత్యధిక స్కోరు బాదింది. ఇటీవల జొహనెస్‌బర్గ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్‌ ఆరంభానికి ముందు సైతం వర్షం సూచనలు ఉన్నాయి. మేఘావృత వాతావరణం, గాల్లో తేమ సీమర్లకు అనుకూలించవచ్చు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. సిరీస్‌ చివరి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావటం ఖాయంగా కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్య, రింకు సింగ్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, రవి బిష్ణోరు, వరుణ్‌ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా : రియాన్‌ రికెల్టన్‌, రీజా హెండ్రిక్స్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌ (కెప్టెన్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డెవిడ్‌ మిల్లర్‌, మార్కో జాన్సెన్‌, గెరాల్డ్‌ కోయేట్జి, సిమెలానె, కేశవ్‌ మహరాజ్‌, లుథో సిపలానె.