నవతెలంగాణ-రామారెడ్డి
మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రాజీనామా పత్రాన్ని రెడీ చేసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 15 లోపు రూ 2లక్షల రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో, హరీష్ రావు విసిరిన సవాలును స్వీకరించి రాజీనామా చేయాలని మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో పెట్రోలు పోసుకొని అగ్గిపెట్టె దొరకక ఆడిన నాటకాలు ఇప్పుడు సాగవని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిందని, దశలవారీగా ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు చేరే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇది ప్రజల ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని, మరోసారి రుజువైందని పేర్కొన్నారు.బి ఆర్ ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నిక కన్ను లొట్ట పోతే, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు రెండు కళ్ళను తీసేశారని, అయినా బి ఆర్ ఎస్ నాయకులకు తెలిసి రావటం లేదని, ఇలాగే ప్రవర్తిస్తే రానున్న రోజులో ప్రజలు గ్రామాలనుండి తరిమికొట్టే రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఇకనైనా ప్రతిపక్ష హోదాను పోషిస్తూ, ప్రభుత్వానికి మంచి సూచనలిస్తూ ప్రజా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.