నోరు అదుపులో పెట్టుకో..

Keep your mouth under control..– బీజేపీ ఎంపీ దూబే వ్యాఖ్యలపై సీపీఐ (ఎం) ఆగ్రహం
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. లోక్‌సభలో చర్చ సమయంలో బీజేపీ ఎంపీ దూబే సీపీఐ (ఎం) పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీపీఐ(ఎం) పార్టీని ఉద్దేశిస్తూ.. ‘దేశ ద్రోహ పార్టీ’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. పొలిట్‌బ్యూరో బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. పార్లమెంటరీ విధానాలను ఉల్లంఘిస్తూ.. తన వాదనను వాస్తవమని నిరూ పించేందుకు వేలాది మెయిల్స్‌ను రికార్డు చేయాలని చూశారు. ఈ విధంగా చేయడం ద్వారా ఆయన ఆరోపణలు అవాస్తమని రుజువయ్యాయని సీపీఐ (ఎం) స్పష్టం చేసింది. ఈ విషయంపై ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది.
సీపీఐ(ఎం) రాజకీయ విధానాలు, సిద్ధాంతాలు తెరచిన పుస్తకంలా ఉంటాయన్నది వాస్తవం. అలాగే బీజేపీ హిందూత్వ, మతతత్వ భావజాలాన్ని సీపీఐ(ఎం) నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోందన్న విషయం కూడా వారికి బాగా తెలుసు. అందుకే ఈ విధంగా దుష్ప్రచారాన్ని నిర్వహిస్తోందని సీపీఐ(ఎం) ధ్వజమెత్తింది.