– తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఎక్సైజ్ పాలసీ కేసులో తాను జారీ చేసిన సమన్లను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ వర్చువల్‌గా న్యాయస్థానంలో హాజరయ్యారు. సభలో విశ్వాస పరీక్ష జరుగుతోందని, వచ్చే నెలలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని, ఇవన్నీ పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని కేజ్రీవాల్ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్య మల్హోత్రాకు విన్నవించారు.
‘నేను వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని అనుకున్నాను. అయితే ఆకస్మికంగా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. మా బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారం వరకూ కొనసాగుతాయి. ఆ తర్వాత మీరు కేసును లిస్ట్ చేయవచ్చు. నేను వ్యక్తిగతంగా హాజరవుతాను’ అని కేజ్రీవాల్ తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
ఈడీ ఫిర్యాదు మేరకు శనివారం కోర్టుకు హాజరు కావాలని అంతకుముందు కేజ్రీవాల్‌ను అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఐపీసీ సెక్షన్ 174 కింద కేజ్రీవాల్‌పై నేరారోపణ చేశారని, సీఆర్‌పీసీలోని సెక్షన్ 204 ప్రకారం ఆయనపై విచారణ జరపడానికి తగిన కారణాలు ఉన్నాయని న్యాయమూర్తి తన ఆదేశాలలో పేర్కొన్నారు. కాగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ జరిపేందుకు వీలుగా సాక్ష్యం చెప్పేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు గత సంవత్సరం అక్టోబర్ 30, నవంబర్ 2, డిసెంబర్ 18, డిసెంబర్ 22 తేదీల్లో ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిపై కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవి చట్టప్రకారం చెల్లుబాటు కావని తెలిపారు.