– సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఆప్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. లిక్కర్ కేసులో ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’ తనను అరెస్టు చేయడం అక్రమం అంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్, తన అరెస్టును సవాల్ చేస్తూ గత వారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల తరువాత తీర్పును రిజర్వు చేసిన ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది.
కాగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం వారంపాటు ఈడి కస్టడీ విధించిన కోర్టు ఆ తరువాత ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా కూడా అరెస్టయి జైలులో ఉన్నారు.
సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. అత్యున్నత న్యాయస్థానంలో బుధవారం నాడు పిటిషన్ వేసే అవకాశం ఉందని ‘ఆప్’ వర్గాల సమాచారం.