అఖిలేశ్‌ను కలిసిన కేజ్రీవాల్‌

– కేంద్రం ‘ఢిల్లీ ఆర్డినెన్సు’పై సమావేశం
– ఆప్‌నకు మద్దతిస్తామన్న ఎస్పీ చీఫ్‌
లక్నో : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఎస్పీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ను కలిశారు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులను కలిసి మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్‌ ఇప్పుడు లక్నోలో అఖిలేశ్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో పాటు పలువురు ఆప్‌ నేతలు కూడా హాజరయ్యారు. ” ఆర్డినెన్సు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది. సమాజ్‌వాది పార్టీ మీతో (ఆప్‌) ఉన్నది, మీకు మద్దతిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని కేంద్రం ఆర్డినెన్సుపై అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఇటు వీరిద్దరి సమావేశం రాజకీయంగానూ చర్చకు దారి తీసింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండటం, ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యతకు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి నాయకుల మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఇద్దరు పెద్ద నాయకులు సమావేశమైనపుడు రాజకీయాల్లో కొత్త దిశ నిర్ణయించబడుతుందనేది సుస్పష్టమని ఎస్పీ కీలక నేత సునీల్‌ సింగ్‌ సజన్‌ అన్నారు. బీజేపీయేతర పార్టీలు కలిసి వస్తే రాజ్యసభలో ఈ ఆర్డినెన్సు వీగిపోతుందని కేజ్రీవాల్‌ అన్నారు. 2024లో మోడీ ప్రభుత్వం రాదనే గట్టి సందేశాన్ని ఇది పంపుతుందని తెలిపారు. రాజ్యసభలో మద్దతు తెలుపుతామని హామీనిచ్చిన అఖిలేశ్‌కు కేజ్రీవాల్‌ ధన్యవాదాలు చెప్పారు.