– నీటి సమస్యల పరిష్కారం కోసం తొలి ఉత్తర్వులు
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన ప్రారంభించారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఎదురువుతున్న నీటి, మురుగు నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని నీటి పారుదాల శాఖ మంత్రి అతిషిని ఆదేశిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. నుంచి క్రేజీవాల్ విడుదల చేసిన తొలి ఉత్తర్వులు ఇవే. శనివారం అర్ధరాత్రి తరువాత ఈ ఆదేశాలు తమకు అందినట్లు ఆదివారం విలేకరుల సమావేశంలో మంత్రి అతిషి తెలిపారు. జైలులో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలపై శ్రద్ధ చూపడం తనకు కన్నీళ్లు తెప్పించిందని ఆమె చెప్పారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి సరఫరాను పటిష్టం చేయాలని, నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకు తగినన్ని నీటి ట్యాంకర్లను తరలించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్ నిర్దేశించారని చెప్పారు. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సహాయాన్ని కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని, లెఫ్టినెంట్ గవర్నర్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి అతిషి తెలిపారు.