– ఈడీ అరెస్టుపై హైకోర్టు తీర్పుతో ఈ నిర్ణయం
– సోమవారం విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఈడీ అరెస్టుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. అరెస్టు సబబే అని పేర్కొంది. దీంతో నిరాశ చెందిన కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ను సింఘ్వీ కోరారు. కానీ కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సీజేఐ నిరాకరించారు. ‘ఆ పిటిషన్ సంగతి తర్వాత చూస్తాం’ అని వ్యాఖ్యానించారు. దీంతో తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ సోమవారం జరగనుంది.మరోవైపు మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో తన లాయర్లను కలిసేందుకు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు వారానికి రెండుసార్లు మాత్రమే తన లాయర్లను కలవడానికి అనుమతి ఉంది. అయితే.. వారానికి ఐదు సార్లు కలిసేలా అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టుని కోరారు.