తిరువనంతపురం: భారత పురుషుల జట్టు హాకీ గోల్‌కీపర్, ఆర్‌పి శ్రీజేశ్‌కు కేరళ ప్రభుత్వం భారీ నజరానా ప్రనకటించింది. తాజాగా కేరళ ప్రభుత్వం అతడికి రూ.2 కోట్ల నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిఎంఓ బుధవారం ప్రకటించింది. ‘భారత హాకీ జట్టులో సభ్యుడు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన శ్రీజేశ్‌కు రెండు కోట్ల రూపాయలు బహుమతిగా అందిస్తున్నాం’ అని ప్రకటనలో తెలిపింది. కేరళకు చెందిన శ్రీజేశ్ 2004లో జాతీయ జూనియర్ జట్టులో.. అనంతరం సీనియర్ జట్టులోకి చేరాడు. 20 ఏళ్లలో భారత్ తరఫున 336 మ్యాచ్‌లు ఆడాడు. అతడి ఖాతాలో రెండు ఒలింపిక్ పతకాలతో పాటు రెండు ఆసియా క్రీడల స్వర్ణాలు, రెండు కామన్వెల్త్ రజతాలు, రెండు ఛాంపియన్ ట్రోఫీ రజతాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యం సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికాడు. శ్రీజేశ్‌ను జూనియర్ టీమ్‌కు ప్రధాన కోచ్‌గా హాకీ ఇండియా నియమించింది. అదేవిధంగా సీనియర్ జట్టు నుంచి జెర్సీ నంబరు 16కు సైతం రిటైర్‌మెంట్ ఇస్తున్నట్లు ఇటీవల శ్రీజేశ్ ప్రకటించాడు.