– కేరళ కర్షక తుల్లాలి(వ్యవసాయ కార్మిక సేన) సభలో బి.వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పనిచేస్తుంటే, దేశంలో మతోన్మాదం పెంచి, కార్పొరేట్ వర్గాలకు ఉపయోగపడేలా దేశాన్ని అస్థిత్వ పరిచేలా మోడీ పని చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అందిస్తూ ప్రతిరోజు రూ.800 – 900 వేతనాలు ఇచ్చే కృషిని కేరళలో ప్రజా ప్రభుత్వం చేస్తున్నదని, వ్యవసాయ కార్మికులకు, రైతులకు, ఇతర పనుల వారికి ఉపయోగ పడేలా ”(కర్షక తుల్లాలి)” వ్యవసాయకార్మిక, కర్షక సేన” ను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేక యూనిఫాంతో ఈ సేన ఉంటుందన్నారు. లక్లలాది మంది సభ్యలుగా ఉన్నారని అన్నారు. కేరళలోని పాలక్కడ్‌లో కార్మిక, కర్షక సేన సభకు ముఖ్య అతిథిగా హాజరైన బి.వెంకట్ మాట్లడుతూ గతంలో గ్రామీణాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేసిన కేరళ ప్రభుత్వం, నేడు వ్యవసాయ కార్మికుల కోసం వారి వేతనాల కోసం కార్మికులు, కర్షకులు మధ్య వారధిగా నిలిచేందుకు కర్షక తుల్లాలి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేరళ ప్రజా ప్రణాళికలు రూపొందించుకొని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం, మత సామరస్యంతో దూసుకుపోతుంటే, దేశంలో మోడీ ప్రభుత్వం మత విభజన, మతోన్మాదం, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగం అమ్మకంతో దేశాన్ని, ప్రజలను అస్థిత్వ పరిచే కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. అందుకే వ్యవసాయ కార్మిక సంఘం కేరళ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలంతా తమ ప్రభుత్వాన్ని తాము కాపాడుకుంటామంటూ క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రతి కుటుంబాన్ని కలిసి వామపక్ష ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని నిర్ణయించిందన్నారు. కార్మిక కర్షక మైత్రితో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుందన్నారు.