కేరళ ముందడుగు

Kerala is a step forwardమలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్‌ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో- సినిమా రంగంలోని మహిళలకు గౌరవమూ, రక్షణ చేకూర్చే చర్యలపై మరొకసారి చర్చ జరుగుతోంది. అవకాశాల కోసం పోటీపడే ఈ రంగంలో ఆ అభిలాషనే ఆసరాగా తీసుకొని కాస్టింగ్‌ కౌచ్‌కు పాల్పడుతున్న సంఘటనలపై చాలాకాలంగా నిరసన వ్యక్తమవుతోంది. 2006లో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని చోట్లా పెద్దఎత్తున మీటూ ఉద్యమం జరిగింది. తమకు ఎదురైన లైంగిక వేధింపులపై ఎందరో బాధిత మహిళలు గొంతెత్తారు. ఆ తరువాత, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు వంటివి తప్ప దాదాపుగా ఏ పరిశ్రమలోనూ విచారణ జరప లేదు, ఎలాంటి నిర్ధిష్ట చర్యలూ చేపట్టలేదు.
కేరళలో 2017 ఫిబ్రవరిలో భావన అనే నటిపై కారులోనే కొందరు లైంగిక దాడికి ప్రయత్నించటం, ఆమె తప్పించుకొని రెండోరోజు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిన నేపథ్యంలో- చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు స్పందించారు. విమెన్‌ వింగ్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ (డబ్ల్యుసిసి) ఏర్పడి, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వినతిపత్రం ఇచ్చారు. వామపక్ష ప్రభుత్వం వెంటనే స్పందించి, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ కె.హేమ నేతృత్వాన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ముందుకు నేరుగా వచ్చి మాట్లాడటానికి కొంతమంది వెనకాడుతున్నారని తెలిశాక- ఫిర్యాదుదారుల వివరాలు, విషయాలూ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టబోమని, ఏ రూపంలోనైనా తమకు వాంగ్మూలాలు అందజేయవచ్చునని జస్టిస్‌ హేమా కమిటీ ప్రకటించింది. ఎక్కువమందిని కలవటానికి, వారి ఫిర్యాదులు నమోదు చేయటానికి ప్రాధాన్యం ఇచ్చింది. రెండేళ్ల పాటు విచారణ జరిపి, 2019 డిసెంబరు 31న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికను బయటపెట్టమని కొందరు డిమాండు చేయగా- అంశాల్లోని సున్నితత్వం, ఫిర్యాదుదారుల గోప్యత తదితర కారణాల వల్ల నివేదిక బహిరంగ వెల్లడికి జస్టిస్‌ హేమ కమిటీ ఒప్పుకోలేదు. సున్నిత అంశాలను మినహాయించి, మిగతా అంశాలను వెల్లడించా ల్సిందిగా ఇటీవల హైకోర్టు ఆదేశించటంతో ఆగస్టు 17న ఈ నివేదిక బహిర్గతమైంది.
జస్టిస్‌ హేమా కమిటీ ఈ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. మలయాళ సినిమా పరిశ్రమలో కొంతమంది మగ దర్శకుల, నటుల పెత్తనం సాగుతోందనిబీ పశ్నించేవారిపై అనధికార నిషేధం కొనసాగుతోందనిబీ మహిళా నటులపై లైంగిక వేధింపులు సాగుతున్నాయనిబీ సర్దుకుపోవడం, రాజీపడడం అనేది ఒక సూత్రంగా అమలు చేయబడుతోందని వివరించింది. జూనియర్‌ నటుల పట్ల తీవ్రమైన వివక్ష ఉందని, పని ప్రదేశాల్లో బట్టలు మార్చుకోవటానికి కానీ, కాలకృత్యాలు తీర్చుకోవటానికి కానీ తగిన ఏర్పాట్లు ఉండడం లేదని పేర్కొంది.
చిన్న నటులతో రాతపూర్వక ఒప్పందాలు ఉండడం లేదని, ఎక్కువ పని చేయించుకొని తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. నాలుగేళ్ల క్రితం నివేదిక తనకు అందిన నాటి నుంచి సినీ పరిశ్రమలో మహిళలకు రక్షణ చర్యలను ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేపట్టింది. నిర్మాతల మండలితో, దర్శకులతో సంప్రదింపులు జరిపి, షూటింగ్‌ ప్రదేశాల్లో మహిళలకు తగు సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే ప్రధాన ఉద్దేశంగా ఉన్న కొన్ని శక్తులు ఈ నివేదికలోని సున్నితాంశాలపై రచ్చ చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దటానికి, మహిళల ఆత్మగౌరవం కాపాడ్డానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కమిటీ వేసి విచారణ జరిపించామని ముఖ్యమంత్రి పినరన్‌ విజయన్‌ మరోసారి స్పష్టం చేశారు.
కేరళ సమాజంలో నెలకొని ఉన్న చైతన్యపూరిత వాతావరణం సినీ పరిశ్రమలోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. హక్కుల పట్ల, ఆత్మగౌరవం పట్ల తగినంత ఎరుకను అక్కడి నటీనటులు ప్రదర్శిస్తారు. మీటూ ఉద్యమం జరిగినా దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ ప్రభుత్వమూ ఎలాంటి కమిటీలను వేసి, విచారణ జరపలేదు. కేరళలో మాత్రమే అలాంటి ప్రయత్నం జరిగింది. జస్టిస్‌ హేమా కమిటీ నివేదికలో పేర్కొన్న పరిస్థితులు అన్ని సినీ పరిశ్రమల్లోనూ నెలకొని ఉన్నాయి. నటీనటులకు సమాన గౌరవం, జూనియర్‌ నటులకు తగు సదుపాయాల కల్పన, పారితోషికాల్లో తీవ్ర వ్యత్యాసాల నివారణ వంటివి ప్రయత్నపూర్వకంగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ కల్పించాల్సి ఉంది. కేరళ వలె ప్రభుత్వాలు అన్నిచోట్లా విచారణ, అధ్యయనం జరిపించి, తగు చర్యలు తీసుకోవాలి.