దేశానికే కేరళ ఆదర్శం

– సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు బాధ్యతారహితం
– వాస్తవాలను విస్మరించి మాట్లాడ్డం అభ్యంతరకరం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడాన్ని, కేంద్ర బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కేసీఆర్‌ ఆహ్వానం మేరకు విజయన్‌ పాల్గొనడాన్ని రేవంత్‌రెడ్డి తప్పుపట్టారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్‌ అవినీతిపరుడనీ, ఆయన్ను కలిసిన విజయన్‌ కూడా అవినీతిపరుడనీ, అందుకే కేసీఆర్‌ను కలిసారంటూ నోరు పారేసుకున్నారని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం సంప్రదాయమన్న విషయం రేవంత్‌రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడే క్రమంలో కేసీఆర్‌ ఆహ్వానం మేరకు వచ్చి సభలో పాల్గొని విజయన్‌ ఏం మాట్లాడారో రేవంత్‌రెడ్డి మరిచిపోవడం ఆశ్చర్యకరమని తెలిపారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సీపీఐ(ఎం) పాత్ర ఏంటో కూడా మరిచిపోయి, బాధ్యత మరచి, తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. అభివృద్ధి సూచికల్లో దేశానికే కేరళ ఆదర్శమని వివరించారు. కరోనాను ఎదుర్కోవడంలో, ప్రజలను ఆదుకోవడంలో ఐక్యరాజ్య సమితి అభినందనలను అందుకున్న ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. విద్య, వైద్యం, అధికార వికేంద్రీకరణ, ప్రజాసంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార రంగం అభివృద్ధిలోనూ, మహిళలకు, సామాజికంగా వెనకబడిన తరగతులకు భద్రత కల్పించడంలోనూ కేరళ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందున్నదని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం, అధికారాల కోసం కేంద్రంతో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నదని వివరించారు. లౌకిక విలువల పరిరక్షణ కోసం, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నదని తెలిపారు. ఇవి తట్టుకోలేకనే మోడీ ప్రభుత్వం కక్షతో కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు అభ్యంతరకరమని తెలిపారు.