కేరళ మరో ప్రత్యేకత

– చంద్రయాన్‌-3 విజయవంతంలో మూడు కేరళ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర
– ఈ మిషన్‌లో భాగమైనందుకు కేరళకు గర్వంగా ఉంది : పి.రాజీవ్‌, కేరళ పరిశ్రమల మంత్రి
న్యూఢిల్లీ : శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-3 విజయవంతం కావడంలో కేరళ తన ప్రత్యేకతను చాటుకున్నది. చంద్రయాన్‌-3లో కేరళ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) కీలక పాత్ర పోషించాయి. మిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కేరళ స్టేట్‌ ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఎస్‌ఈడీసీ)కి చెందిన కెల్ట్రాన్‌, కేరళ మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌ లిమిటెడ్‌ (కేఎంఎంఎల్‌), స్టీల్‌ అండ్‌ ఇండిస్టియల్‌ ఫోర్జింగ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐఎఫ్‌ఎల్‌), తిరువనంతపురం ఆధారిత కోర్టాస్‌ ఇండిస్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారు చేసిన వివిధ ఉత్పత్తులు ఈ మిషన్‌లో ఉపయోగించారు. ‘ప్రపంచం ముందు భారతదేశం సగర్వంగా నిలుస్తోంది. ఈ మిషన్‌లో భాగమైనందుకు కేరళకు కూడా గర్వంగా ఉంది’ అని కేరళ రాష్ట్ర పరిశ్రమల మంత్రి పి. రాజీవ్‌ అన్నారు. కెల్ట్రాన్‌ 41 ఎలక్ట్రానిక్‌ మాడ్యూళ్లను అందించగా, కేఎంఎంఎల్‌ టైటానియం స్పాంజ్‌ మెటల్‌ను అందించింది. ఇది క్లిష్టమైన భాగాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఎస్‌ఐఎఫ్‌ఎల్‌ టైటానియం, అల్యూమినియం ఫోర్జింగ్‌లు, ఇతర భాగాలు అందించింది. వెలిలోని ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంతంలో ఉన్న ఏరోస్పేస్‌ తయారీ సంస్థ కోర్టాస్‌ ఇండిస్టీస్‌ మిషన్‌ వివిధ దశల కోసం అనేక విడి భాగాలను అందించింది. నాలుగు సంస్థలు వివిధ ప్రాజెక్టుల కోసం భాగాలను అందించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో అనుబంధం కలిగి ఉన్నాయి. అంతరిక్ష ఎలక్ట్రానిక్స్‌లో 30 ఏండ్ల అనుభవం ఉన్న కెల్ట్రాన్‌, ఈసారి ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎల్‌వీఎం-3పై ఇంటర్‌ఫేస్‌ ప్యాకేజీలు, ఏవియానిక్స్‌ ప్యాకేజీలు, చంద్రయాన్‌ కోసం పవర్‌ మాడ్యూల్స్‌, ఇతర పరీక్ష, మూల్యాంకన మద్దతును అందించింది. అల్లారు ఫోర్జింగ్‌లను రూపొందించడంలో ఎస్‌ఐఎఫ్‌ఎల్‌ నైపుణ్యాన్ని ఇస్రో బాగా ఉపయోగించుకుంది. ఇస్రో నాణ్యతా నియంత్రణ ప్రమాణాల ప్రకారం అసెంబ్లింగ్‌, ఫ్యాబ్రికేషన్‌ ప్రక్రియలను నిర్వహించడంతో కెల్ట్రాన్‌ మిషన్‌లో భాగమైంది. కరకులంలో కెల్ట్రాన్‌ ఎక్విప్‌మెంట్‌ కాంప్లెక్స్‌, తిరువనంతపురంలోని మన్విలాలోని కెల్ట్రాన్‌ కమ్యూనికేషన్‌ కాంప్లెక్స్‌ ఈ ప్రాజెక్ట్‌ వెనుక ఉన్నాయి. ‘కెల్ట్రాన్‌ 300లో దాదాపు 50 ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను చాలా ఉపగ్రహ ప్రయోగ ప్రక్రియల్లో అందిస్తుంది. దీని ద్వారా అంతరిక్ష రంగానికి అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో కెల్ట్రాన్‌ కూడా భాగమవుతోంది’ అని పీఎస్‌యూ ఒక ప్రకటనలో తెలిపింది. కొల్లంలోని చవరాలో కేఎంఎంఎల్‌ టైటానియం స్పాంజ్‌ ప్లాంట్‌ భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా 2011లో ప్రారంభించబడింది. అవాంతరాలు ఉన్నప్పటికీ.. ఈ పీఎస్‌యూ చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3 రెండింటికీ టైటానియం స్పాంజ్‌ను అందించగలిగింది. ‘కేఎంఎంఎల్‌ మెగ్నీషియంను వేరు చేయడానికి మెగ్నీషియం క్లోరైడ్‌ను రీసైక్లింగ్‌ చేసే ప్రక్రియలో ఉంది. విక్రమ్‌ సారాభారు స్పేస్‌ సెంటర్‌, డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రీసెర్చ్‌ లాబొరేటరీతో పాటు, నావికాదళం కూడా ఇప్పుడు మా ఉత్పత్తిపై ఆసక్తిని కనబరిచాయి’ అని కేఎంఎంఎల్‌ అధికారి ఒకరు తెలిపారు.