– అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలుగా ప్రతిభ
– రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్-2022 నాలుగో ఎడిషన్ వెల్లడి
న్యూఢిల్లీ: రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ (2022) నాలుగో ఎడిషన్‌లో కేరళ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. వర్ధమాన వ్యాపారవేత్తలను ప్రోత్సహించటం కోసం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయటానికి వారి(రాష్ట్రాల) చొరవలపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది. ‘బెస్ట్ పెర్ఫార్మర్’ అనేది టాప్ మోస్ట్ స్టార్టప్ ర్యాంకింగ్ స్థాయి. ఆ తర్వాత స్థానం ‘టాప్ పెర్ఫార్మర్’ టైటిల్‌ది. బెస్ట్ పెర్ఫార్మర్ జాబితాలో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. గుజరాత్ వరుసగా నాలుగోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచగా, కర్నాటక వరుసగా రెండో ఏడాది ఆ స్థానాన్ని గెలుచుకున్నది. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్‌లు ‘టాప్ పెర్ఫార్మర్’ రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. కేరళ గత మూడేండ్లుగా ‘టాప్ పెర్ఫార్మర్’ టైటిల్‌ను గెలుచుకున్నది.
ఇది గర్వకారణం : కేరళ సీఎం
నాలుగో ఎడిషన్‌లో కేరళ అగ్రస్థానంలో నిలవటం గర్వకారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. స్టార్టప్ మిషన్ కింద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించటంలో కేరళ తిరుగులేని నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇది నాలెడ్జ్ ఎకానమీగా మారే మా అవకాశాలను ప్రోత్సహిస్తుందని సీఎం వివరించారు. ఆధునిక సాంకేతికత, విధాన మద్దతుతో శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ, ఇంక్యుబేషన్ సిస్టమ్‌ను కొనసాగించటానికి కట్టుబడి ఉన్న చర్యలను అనుసరించి రాష్ట్రం ఈ ఫలితాన్ని సాధించిందని కేరళ స్టార్టప్ మిషన్(కేఎస్‌యూఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనూప్ అంబికా అన్నారు. కేరళ కేఎస్‌యూఎం కింద 5,000 స్టార్టప్‌లను నమోదు చేసింది. వాటిలో 250 మార్కెట్‌లోకి ప్రవేశించాయి. 100కి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 50 ఇంక్యుబేటర్లను కలిగి ఉన్నది. పెట్టుబడులను సమీకరించటానికి అవగాహన కార్యక్రమాలు, ప్రాజెక్టులను చురుకుగా ప్రోత్సహిస్తున్నది.