అడ్వెంచర్‌ టూరిజంపై కేరళ దృష్టి

అడ్వెంచర్‌ టూరిజంపై కేరళ దృష్టి– గతేడాది పర్యాటకుల్లో 16 శాతం వృద్థి
– టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ సలీం వెల్లడి
నవతెలంగాణ- హైదరాబాద్‌
కేరళ ప్రభుత్వం అడ్వెంచర్‌ టూరిజంపై కీలక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రకృతి అందాలతో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఆ రాష్ట్రం.. ఇక అడ్వెంచర్‌, హెలీ టూరిజం అభివృద్థికి భారీగా ఖర్చు పెడుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో బి2బి క్యాంపెయిన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా కేరళ టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ విఎం సలీం మీడియాతో మాట్లాడారు. 2023లో దేశీయంగా 16 శాతం వృద్థితో 2.2 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించామన్నారు. గతేడాది 88 శాతం పెరుగుదలతో 6.5 లక్షల విదేశీ పర్యాటకులు తమ రాష్ట్రానికి వచ్చారన్నారు. కొత్తగా ‘కమ్‌ టు గెదర్‌ ఇన్‌ కేరళ’ క్యాంపెయిన్‌తో పర్యాటకులను మరింత ఆకర్షించే పనిలో ఉన్నామన్నారు. ఇందులో భాగంగా హెలీ టూరిజంను ప్రవేశపెట్టబోతున్నామన్నారు. దీంతో 2024లో కేరళ టూరిజాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్రంలోని అన్ని గమస్థానాలను కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనికి ‘స్కై ఎస్కేప్స్‌’గా నామకరణం చేశామన్నారు. దేశంలో సమగ్ర హెలీ టూరిజం పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచిందన్నారు.
” గ్లోబల్‌ అడ్వెంచర్‌ టూరిజం మ్యాప్‌లో కేరళను ప్రథమస్థానంలో ఉంచే లక్ష్యంతో, ఈ ఏడాది నాలుగు అంతర్జాతీయ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్‌లను నిర్వహించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా 2032 నాటికి అడ్వెంచర్‌ టూరిజం 20 శాతం వృద్థి చెందుతుందని అంచనా. దేశీయ టూరిజం వృద్థిలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నాము. అదే విధంగా ఏప్రిల్‌ 26 నుండి వయనాడ్‌లోని మనంతవడిలోని ప్రియదర్శిని టీ ప్లాంటేషన్‌లో జరుగుతుంది. మలబార్‌ రివర్‌ ఫెస్టివల్‌ 2024 జూలై 25 నుండి 28 వరకు కోజికోడ్‌లోని కోడెన్‌చేరిలో నిర్వహించనున్నాం.” కేరళ టూరిజం శాఖ తెలిపింది. అక్టోబర్‌ నుండి మార్చి వరకు కేరళను సందర్శించేందుకు ఉత్తమ సమయమన్నారు. మారుతున్న పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా, వారి బసను మరింత థ్రిల్లింగ్‌ మార్చడానికి విస్తృతమైన వ్యూహాలను రూపొందిస్తున్నామని సలీమ్‌ తెలిపారు. కొత్త ప్రాజెక్ట్‌లతో పాటు, బీచ్‌లు, హిల్‌ స్టేషన్‌లు, హౌస్‌బోట్లు మరియు బ్యాక్‌వాటర్‌ సెగ్మెంట్‌ వంటి రాష్ట్ర ప్రధాన ఆకర్షణలు సందర్శకుల అనుభవాన్ని మరింతగా పెంచుతాయన్నారు.