– మరో 9 మందిపై కేసు
– బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ.
– నవతెలంగాణ వార్తకు స్పందన
నవతెలంగాణ – బాన్సువాడ (నసూరుల్లాబాద్)
విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయుడుని అరెస్టు చేసి అతనికి సహకరించిన మరో 9 మందిపై కేసు నమోదు అయినట్లు బాన్సువాడ డీఎస్పీ, టీ, సత్యనారాయణ, సీఐ టౌన్ ఏం కృష్ణ తెలిపారు. బుదవారం నవతెలంగాణ పత్రికలో కీచక ఉపాధ్యాయుడు అనే శీర్షిక ప్రచురితం కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుదవారం ఆ గ్రామానికి వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ చేసిన కేసు నమోదు చేశారు. గురువారం బాన్సువాడ డీఎస్పీ మాట్లాడుతూ. మహిళలపై, మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం బాన్సువాడ మండలంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, అదే పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై గ్రామానికి చెందిన కొంతమంది మధ్యవర్తులు ప్రభుత్వ ఉపాధ్యాయుడికి, విద్యార్థిని తల్లిదండ్రులకు మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం ఆలస్యంగా ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి సహకారంతో బాలిక, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై సెక్షన్ 9,10 ఆఫ్ ఫోక్సో ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దానితోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడికి, బాలిక తల్లిదండ్రులకు మధ్య రాజి కుదిర్చిన 9 మంది మధ్యవర్తులపై కూడా సెక్షన్ 21 ఆఫ్ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా పాఠశాలలో పనిచేసే ప్రదేశాల్లో, ఇతర చోట్ల మహిళలు, చిన్న పిల్లలపై వేధింపులకు పాల్పడితే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, మధ్యవర్తులు రాజీకి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.