కేజీబీవీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

– కనీస వేతనమూ ఇవ్వకుండా వెట్టిచాకిరీ : బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మెన్‌ రాచాల యుగంధర్‌ గౌడ్‌
– విద్యాశాఖ కమిషనరేట్‌ ముట్టడి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మెన్‌ రాచాల యుగంధర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేజీబీవీ, యుఆర్‌ఎస్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యా శాఖ కమిషర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ఉద్యోగులు కార్యాలయం గేటు ముందు బైటాయించి, వర్షాన్ని లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాచాల యుగంధర్‌గౌడ్‌ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ.. బాలికల విద్య కోసం ప్రత్యేకంగా కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. అక్కడ ఇరవై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాల్సిన ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వకుండా ఉద్యోగులచే వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు మంజూరు చేసి, నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. పీఈటీ, ఏఎన్‌ఎం కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌లను సీఆర్టీలుగా ప్రమోట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి, పీఆర్సీ సిఫారసు చేసిన విధంగా వేతనాలు పెంచడంతోపాటు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా సెలవులు మంజూరు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, ఈనెల ఆఖరిలోగా పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్‌ నాయుడు, రవిప్రసాద్‌ గౌడ్‌, డి.కృష్ణయ్య, హమీద్‌, తిమ్మప్ప, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.