కేజీబీవీ బదిలీలకూ పైరవీల బెడద

పలువురు రాజకీయ నాయకుల జోక్యం
– లోపించిన పారదర్శకత
– ఖాళీలను దాచిన ఎస్పీడీ కార్యాలయం
– ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ బదిలీలు పైరవీలతో దొడ్డిదారిన జరుగుతాయి. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పైరవీ చేసి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో అధికారులు చేపడతారు. అయితే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేసే ఉపాధ్యాయుల బదిలీలకూ పైరవీ బెడద తప్పడం లేదు. సుదూరంగా చాలీచాలని వేతనంతో దశాబ్దాలుగా ఒకే చోట పనిచేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులు పదే పదే ప్రభుత్వాన్ని కోరిన మేరకు ఎట్టకేలకు బదిలీలకు అనుమతించింది. బదిలీల పారదర్శకతకు ప్రభుత్వం పాతరేసినట్టుగా విమర్శలు వస్తున్నాయి. అస్మదీయులకు అర్హత లేకున్నా, దరఖాస్తు చేయకున్నా, అనుకూలమైన స్థానాలను కట్టబెట్టేందుకు కొందరు పైరవీలకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఆన్‌లైన్‌ బదిలీలను కూడా ఎలా దుర్వినియోగం చేయొచ్చో విద్యాశాఖను చూసి నేర్చుకోవాల్సిందేనని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత అవసరాలు, భార్యాభర్తలు ఉద్యోగులు, అనారోగ్యం తదితర కారణాలతో అనుకూలమైన ఖాళీకి బదిలీ కోరుకుందామని దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులకు ఆప్షన్లు ఇచ్చుకునే సమయానికి వారు కోరుకున్న స్థానం కనపడకపోయేసరికి ఆందోళన చెందుతున్నారు. ఎప్పటినుంచో ఖాళీగా ఉండి బదిలీలకు ముందు డీఈవో కార్యాలయం ప్రకటించిన ఖాళీల జాబితాలో ఆప్షన్లు ఇచ్చుకునే సమయానికి అవి మాయమైపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరు ఉద్యోగులు ఆ ఖాళీలను ఎందుకు చూపడం లేదంటూ ఏఎస్పీడీని సంప్రదిస్తే, అవునా… అలాగా…ఉన్నవాటిల్లో ఆప్షన్‌ ఇవ్వండి అని హేళనగా మాట్లాడినట్టు కేజీ బీవీ ఉపాధ్యాయులు వాపోతున్నారు. సంఘ నాయ కులు అడిగినప్పుడు ఉపాధ్యాయ సంఘాల ప్రతి నిధులు గట్టిగా నిలదీస్తే పైవారి ఆదేశాలమేరకే కొన్ని ఖాళీలను బ్లాక్‌ చేశామంటూ అధికారులు సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు. అయితే ఆన్‌లైన్‌లో వారు కోరుకున్న స్థానాలు దక్కవనుకున్న కొందరు ఉద్యోగులు రాజకీయ పలుకుబడిని ఉప యోగించి ఖాళీలను బ్లాక్‌ చేయించుకున్నారని, ఇదే అదనుగా రాష్ట్ర కార్యాలయం స్థాయిలో మరికొన్ని ఖాళీలను బ్లాక్‌ చేశారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఈ ప్రహసనంలో పెద్ద ఎత్తున నగదు కూడా చేతులు మారినట్టు విమర్శలొస్తున్నాయి.
కేజీబీవీల్లో ఖాళీ ఉన్నా చూపించని పలు పోస్టులు
– ఉదా: వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి లో పనిచేసే ఎస్‌వో మాధవి అక్కడ నుంచి బదిలీ కాకుండానే ఆ పోస్ట్‌ ఖాళీగా చూపిస్తున్నారు. హన్మకొండ జిల్లాలో ఖాళీగా ఉన్న ధర్మసాగర్‌ ఎస్‌వో పోస్ట్‌ను బ్లాక్‌ చేశారు. ధర్మసాగర్‌ స్థానానికి బదిలీ కావాలనుకున్న పలువురు ఎస్‌వోలు అది ఖాళీ కనిపించక ఆందోళన చెందుతున్నారు.
– రంగారెడ్డి జిల్లా కొత్తూరు కేజీబీవీలో పీజీసీఆర్టీ సివిక్స్‌ పోస్ట్‌ ఖాళీగా ఉన్నది. కానీ ఆప్షన్‌ ఇచ్చేటపుడు ఆ పోస్టు ఖాళీగా చూపించడం లేదు.
– మంచాల మండలం పీజీసీఆర్టీ ఎకనామిక్స్‌ ఖాళీ ఉన్నా కనిపించడం లేదు.
– వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో ఉన్న సీఆర్టీ తెలుగు నల్లబెల్లికి అలాట్‌ కావడం జరిగింది. కానీ అది ఖాళీగా చూపించడం లేదు.
– మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కేజీబీవీ గండ్విడ్‌లో పీజీసీఆర్టీ (నర్సింగ్‌) పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ దాన్ని చూపించడం లేదు.
– వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట కేజీబీవీలో పీజీసీఆర్టీ బాటనీ పోస్టును ఖాళీ చూపించడం లేదు.
– రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో సీఆర్టీ సోషల్‌ పోస్టు ఖాళీ అయినా అరైసింగ్‌ వేకెన్సీగా చూపించడం లేదు.
– నాగర్‌ కర్నూల్‌ జిల్లా కోడేరు కేజీబీవీ ఎస్‌వో ఖాళీగా ఉన్నా చూపించడం లేదు.ఇవే కాకుండా ఇంకా పలు ఖాళీలను అధికారులు బ్లాక్‌ చేసినట్టుగా తెలుస్తున్నది.
పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలి : టీఎస్‌యూటీఎఫ్‌
కేజీబీవీ బదిలీలకు సంబంధించి బ్లాక్‌ చేసిన ఖాళీలన్నింటినీ ఓపెన్‌ చేయాలని. పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో అక్రమ బదిలీలు ఒక ఆనవాయితీగా వస్తున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేజీబీవీ బదిలీల్లో అక్రమాలను అరికట్టకుంటే వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.