– భారీ మైనింగ్ కుంభకోణం శ్రీ రూ.10 వేల కోట్ల సంపదపై మాఫియా కన్ను
– 500 హిటాచీలతో పహారా
– వైసిపి, టిడిపి నేతల లాలూచీ
నెల్లూరు : కెజిఎఫ్ సినిమా గుర్తుంది కదా..! దానిని తలదన్నేలా నెల్లూరు జిల్లాలో సాగుతున్న మైనింగ్ కుంభకోణం ఇది! ఒకప్పుడు అబ్రకం (మైకా)కు ప్రసిద్ధమైన నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో తాజాగా తెల్లరాయి (వైట్ స్టోన్) వెలుగులోకి వచ్చింది. ఆ రాయి కేంద్రంగా ఇక్కడ మాఫియా దందా సాగుతోంది. ప్రతి చిన్న విషయానికి ఒకరిపై ఒకరు విరుచుకుపడే వైసిపి, టిడిపి నాయకులు ఈ తెల్లరాయి విషయంలో పరస్పరం చేతులు కలిపి గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నారు. కెజిఎఫ్ సినిమాలో మాదిరే మైనింగ్ జరుగుతున్న వైపు సామాన్యులు కన్నెతి చూడటానికి కూడా వీలులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మాఫియాను కాదని ఎవ్వరూ ఆ ప్రాంతంలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకుల లాలూచీతో జరుగుతున్న వ్యవహారం కావడంతో అధికారయంత్రంగా కిమ్మనకుండా ఊరుకుంది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్, అటవీశాఖ, ఎస్‌ఇబి ఇలా అనేకశాఖలకు ఇక్కడ నుండి తరలిపోతున్న వేల కోట్ల రూపాయల సంపద విషయం తెలిసినా, మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి నుండి చెన్నరు ఓడరేవు ద్వారా వెయ్యికోట్ల రూపాయల తెల్లరాయి చైనాకు తరలివెళ్లినట్లు సమాచారం.
ఐదు నెలల నుంచి ….
సైదాపురం ప్రాంతంలో ఐదు నెలల నుండి మైనింగ్ మాఫియా దందా ప్రారంభమైంది. చైనాకు చెందిన కొందరు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయనేతలు తమ అనుచరులు, మందీ మార్భలంతో అప్పటి నుండి ఈ ప్రాంతంలో మకాం పెట్టారు. మండలంలోని పెరుమళ్లపాడు, చాగణం, గులించర్ల, కృష్ణారెడ్డిపల్లి, మర్లపూడి, పిచ్చిరెడ్డిపల్లి, పాలూరు, గ్రామాల్లో కొండలు, అడవులు, ప్రభుత్వ భూమి, పెద్ద ఎత్తున ఉన్నాయి. అధికారికంగా పదిమంది పేర్లతో ఈ ప్రాంతంలో మైనింగ్ లీజుకు తీసుకుని విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. ఒకప్పుడు భారీఎత్తున సాగి, ఇప్పుడు నామమాత్రానికే పరిమితమైన మైకా మైనింగ్‌ను కూడా అడ్డుపెట్టుకుని తెల్లరాయి వెలికితీత సాగిస్తున్నారు. ఐదు నెలల క్రితం వరకు ఒక టన్ను కేవలం రూ.2 వేలు మాత్రమే ధర ఉండగా చైనాలో డిమాండ్ పెరగడంతో రాయి నాణ్యతను బట్టి రూ.10 వేల నుంచి రూ.22 వేలకు ధర పలుకుతోంది. దీంతో ఆ దేశానికి చెందిన వ్యాపార వేత్తలు నేరుగా ఇక్కడకు వచ్చి బేరసారాలు మొదలు పెట్టారు.
తరలింపు ఇలా….
తవ్వకాలు జరపడానికి సుమారు 500 హిటాచీలు సైదాపురంలో తిరుగుతున్నాయి. జెసిబి, హిటాచీ సహయంతో రాళ్లను బయటకు తీస్తారు.అక్కడ నుంచి టిప్పర్లతో క్రషింగ్ పాయింట్ వద్దకు చేర్చుతారు. అక్కడ చిన్నముక్కలుగా చేసి లారీల్లో తరలిస్తారు. ఒక్కలారీలో సుమారు 24 టన్నులు తరలిపోతుంది. ఒక్కలారీ లోడ్ తెల్లరాయి విలువ సుమారు రూ.మూడు లక్షలు. రోజుకు వంద నుంచి నూటయాబై లారీలు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. అక్రమ పర్మిట్‌లు, పాత పర్మిట్‌లతో చెన్నరు ఓడరేవుకు వెళ్లి అక్కడ నుంచి చైనాకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు అనధికార లెక్కల ప్రకారం రూ.750 నుంచి వెయ్యి కోట్ల విలువైన తెల్లరాయి తరలిపోయింది. సుమారు 5 నుంచి 10 లక్షల టన్నుల వరకు తెల్లరాయి నిల్వలున్నట్లు తెలుస్తోంది.
విభేదాలు విస్మరించి
భారీగా లాభాలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్ష నేతల కన్ను ఈ ప్రాంతంపై పడింది. అధికార వైసిపి నేతలు రాష్ట్ర స్థాయి నుంచి గద్దల్లా వాలిపోయారు. వైసిపికి చెందిన మంత్రి ఒకరు, ఎంఎల్‌ఎలు, నేతలు నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వారికి స్థానిక టిడిపి నేతల సహకారం పూర్తిస్థాయిలో లభిస్తున్నట్లు సమాచారం. మంత్రి బినామీ పేర్లతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ తవ్వకాలను అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు ఊరకుంటోంది. వీరికి సంబంధం లేకుండా ఇతరులెవరైనా తవ్వకాలు ప్రారంభిస్తే మాత్రం వెంటనే రంగంలోకి దిగి సీజ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.