మోసం చేస్తే ఖబడ్దార్‌

Khabaddar if cheating– గీతకార్మికుల హామీల అమలులో నిర్లక్ష్యం తగదు
– వాగ్దానాలు అమలు చేయకపోతే..ఎన్నికల్లో సత్తాచాటుతాం : కల్లుగీత కార్మిక సంఘం మహాధర్నాలో వక్తల హెచ్చరిక
– వేలాదిగా తరలి వచ్చిన కార్మికులు
– సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గీత కార్మికులంటే అంత చులకనా? వారి బతుకు బాధలు పట్టవా? ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయటం లేదు? ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి వందల మంది చనిపోతుంటే..ఈ సర్కారుకు పట్టదా? సమస్యలు పరిష్కరిస్తామటూ నమ్మించి మోసం చేస్తే ఖబడ్డార్‌..అంటూ వక్తలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అసలు ఇందిరాపార్కువద్ద కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలనుంచి వేలాదిగా కల్లుగీత కార్మికులు తరలి వచ్చారు. కల్లుముంతలు, తాటికమ్మలు, మోకు ముస్తాదుతో.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ..దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ సభా ప్రాంగణానికి గుంపులు, గుంపులుగా చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ మాట్లాడుతూ గీత కార్మికులకు ఇచ్చిన హామీల విషయంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరు ‘నోటితో దీవించి నొసటితో వెక్కిరించిన’ చందంగా ఉందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ గీతన్నలపై వరాల జల్లు కురిపించారని గుర్తు చేశారు. వృత్తిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామనీ, ద్విచక్ర వాహనాలు ఇస్తామనీ, లిక్కర్‌ షాపుల్లో గౌడలకు ఇచ్చే 15 శాతం రిజర్వేషన్లు సొసైటీలకు ఇస్తామనీ, గీతన్న బీమా పధకం అమలు చేస్తామంటూ హామీ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. వాటిని ఎందుకు అమలు చేయటం లేదో కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామని గొప్పలకు పోయి.. బడ్జెట్‌ పత్రంలో మాత్రం రూ. 30 కోట్లు మాత్రమే చూపించారన్నారు. ఇది గీత కార్మికులను మోసం చేయటం కాదా? అని ప్రశ్నించారు. బడ్జెట్‌ పెట్టి ఆరు నెల్లవుతున్నా ఇప్పటికి ఒక్క రూపాయికి కూడా ఖర్చు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌కు తగిన బడ్జెట్‌ కేటాయించకుండా, వృత్తిలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోకుండా మాటలతో కాలం గడపాలని చూస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. రాష్ట్రంలో కల్లు గీస్తున్న గీత కార్మికుల బతుకులకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి క్రమంలో వందలాది మంది చనిపోతున్నారని చెప్పారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు 18 డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో గీతకార్మిక సొసైటీలకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్ల కన్ను పడటంతో అవి అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆయా సొసైటీల పరిధిలో ఉన్న భూములకు ప్రభుత్వమే రక్షణ కోసం. కంచెలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లూరి గోవిందు, వి.వెంకటనర్సయ్య, గౌని వెంకన్న, బాల్నె వెంకటమల్లయ్య, బాలగాని జయరాములు కార్యదర్శులు యస్‌. రమేష్‌ గౌడ్‌, చౌగాని సీతరాములు, బూడిద గోపి, బండకింది అరుణ్‌, గాలి అంజయ్య తదితరులు మాట్లాడారు.