కోల్‌కతా : వివాదాస్పద సందేశ్‌కాలీకి వెళ్లకుండా మంగళవారం సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందాకరత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌కాలీకి వెళ్లే మార్గంలోని ధమఖలి ఫెర్రీ ఘాట్‌లో బృందాకరత్ సహా పలువురు నేతలను పోలీసులు నిలిపివేశారు. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రేషన్ బియ్యం స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్ స్థానిక మహిళల భూములను కబ్జా చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆందో ళనలు చేపట్టిన సంగతి తెలి సిందే.
మహిళలను స్థానిక టీఎంసీ కార్యాల యాలకు పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడినపుడు శాంతికి విఘాతం కలిగిందని, ఇప్పుడు తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని బృందాకరత్ పేర్కొన్నారు. తమ పర్యటనతో సందేశ్‌ఖాలీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఓ పోలీస్ అధికారి చెప్పారని అన్నారు.సందేశ్ కాలి వెళ్లకుండా తమని అడ్డుకోవడం సరికాదని, ఈ చర్యను ఖండిస్తున్నామని అన్నారు. సందేశ్‌కాలీలో జరిగిన ఘటన అనాగరికమని మండి పడ్డారు.గత నెల 5న రేషన్ బియ్యం స్కాం కేసులో విచారణ కోసం టీఎంసీ నేత షాజహాన్ నివాసానికి వెళుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై కొందరు దుండుగులు దాడికి దిగారు.అప్పటి నుంచి షాజహాన్ పరారీలో ఉన్నారు.