ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఖాకీల కర్కశం

Khaki's crackdown on SFI leaders– జూనియర్‌ కాలేజీలో గ్రంథాలయ
– భవన నిర్మాణ పూజకు అభ్యంతరమే నేరం…!
– లాక్కెళ్లి ఆటోల్లో పోలీస్‌ స్టేషన్‌కి తరలింపు
– ఎస్‌ఎఫ్‌ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌పై విచక్షణారహితంగా దాడి
– స్టేషన్‌లోనూ నాయకులను చితకబాదిన పోలీసులు
– తీవ్రంగా ఖండించిన ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ – పెద్దపల్లి
ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులపై పెద్దపల్లి పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. విచక్షణారహితంగా చితకబాదారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్‌ కళాశాలల భవనం ఆవరణంలో జిల్లా గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రఘువీర్‌ సింగ్‌ హాజరయ్యారు. అయితే బాలికల జూనియర్‌ కళాశాల భవన ఆవరణంలో గ్రంథాలయ సంస్థ భవనం నిర్మించొద్దని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా తరలివెళ్లి అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్దపల్లి ఎస్‌ఐ మహేందర్‌ కొంతమంది పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు విద్యార్థులను లాక్కెళ్లారు. ఆటోల్లో కుక్కి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ మార్గమధ్యలో ఆటోలోనే ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌ను ఎస్‌ఐ విచక్షణారహితంగా చితకబాదాడు. నాయకులను, కొంతమంది విద్యార్థులను పెద్దఎత్తున స్టేషన్‌కు తరలించిన పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కొట్టిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఖాకీల కర్కశం దెబ్బలకు ఆయన నోటి నుంచి రక్తం వచ్చినట్టు తెలిసింది. ప్రశాంత్‌తోపాటు జిల్లా కార్యదర్శి సీపెల్లి రవీందర్‌, ఇతర నాయకులు, విద్యార్థుల సెల్‌ఫోన్‌లను పోలీసులు లాక్కున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బాలసాని లెనిన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్‌, నాయకులు నితిన్‌, అనిల్‌, ప్రతిమ ప్రత్యూష రజిత, స్టాలిన్‌, సాయి, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోంది ఎస్‌ఎఫ్‌ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై మాట్లాడితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, స్టేషన్‌కు తరలించే మార్గంలోనే దుర్భాషలాడుతూ ఆటోలోనే ఎస్‌ఐ ఇష్టానుసారంగా దాడి చేశారని చెప్పాడు. తలపై, కడుపులో పిడిగుద్దులు గుద్డారని, స్టేషన్‌కు తీసుకెళ్లిన తరువాత కూడా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రంథాలయ నిర్మాణాన్ని వేరేచోటుకి మార్చాల్సిందే.. సీపెల్లి రవీందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణాన్ని మరోచోట నిర్మించాలి. ప్రభుత్వ బాలిక జూనియర్‌ కళాశాల బిల్డింగ్‌ తొలగించి ఆ స్థలంలో గ్రంథాలయ నిర్మాణం చేపడతామని శంకుస్థాపన చేయడానికి వచ్చిన మినిస్టర్‌ కొప్పుల ఈశ్వర్‌కు విద్యార్థుల బాధలు చెప్పడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు దుర్మార్గంగా దాడులు చేశారు. ఈ ఆప్రజాస్వామిక చర్యను భారత విద్యార్థి ఫెడరేషన్‌ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తున్నాం. పదేండ్లుగా విద్యార్థులకు తరగతి గదులు లేక ల్యాబ్‌లు, స్టోర్‌ రూముల్లో కూర్చొని క్లాసులు వింటున్నారు. ఈ క్రమంలో అన్ని సౌకర్యాలతో కొత్త భవనం కట్టించాలని అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. అవేమీ పట్టించుకోకుండా గ్రంథాలయం నిర్మాణం కోసం ఆ కళాశాల భవనాన్ని తొలగించడం సిగ్గుచేటు. ఇప్పటికైనా గ్రంథాలయ నిర్మాణాన్ని వేరేచోటికి మార్చి కళాశాలకు నూతన భవనం కట్టించాలి. లేకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనా కార్యక్రమాలు ఉధృతం చేస్తాం.