ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి– ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించాలి
– అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్‌
ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్లో, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి అధికారులతో నగర అభివృద్ధిపై మంత్రి సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఖమ్మం నగరాన్ని శానిటేషన్‌, ప్లానింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ తదితర అన్ని విభాగాల్లో నగరం మోడల్‌గా ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. 4.23 లక్షల జనాభా ఉన్న ఖమ్మం నగరానికి 69.50 ఎంఎల్డీ తాగునీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. వేసవిలో నగరంలోని ఏ ప్రాంతంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చిన చోట, పట్టాలు పొందిన వారే ఉంటున్నారా లేక అమ్మడం ఇతరత్రా జరిగిందా విచారణ చేసి, చర్యలు తీసుకోవాలన్నారు. లకారం, ఖానాపురం, మున్నేరు, ధంసలాపురంల వద్ద బఫర్‌ జోన్‌ డీ మార్కు చేసి, నిర్మాణాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 25 ఏండ్లలో నగరంలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏయే ప్రదేశాల్లో రోడ్ల విస్తరణ ఆవశ్యకత ఉందో పరిశీలన చేసి, నివేదిక ఇవ్వాలన్నారు. సమీక్షలో సుడా డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ మార్పులపై చర్చించారు. ఇల్లందు క్రాస్‌ రోడ్‌, ముస్తఫానగర్‌ ప్రాంతాల్లో కమర్షియల్‌ కేటగిరీలుగా ఉండగా, రెసిడెన్షియల్‌ కేటగిరీలుగా, ప్రకాష్‌ నగర్‌ నుంచి ధంసలాపురం రోడ్‌, గోళ్లపాడు ఛానల్‌ అభివృద్ధి, బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్‌ ప్రాంతాల్లో మున్నేరు నది నుంచి 50 మీటర్ల బఫర్‌ జోన్‌లకు ఆలోచన చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో ఖమ్మం ఆర్డీవో జి.గణేష్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సురేందర్‌, ఖమ్మం నగర పాలక సంస్థ సహాయ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ రంజిత్‌, మునిసిపల్‌ ఈఈ కృష్ణలాల్‌, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.