– ఆరు నెలల కిందట వెళ్లిన సాయితేజ
– కాన్క్రోడియా యూనివర్సిటీలో ఎంఎస్
– షాపింగ్‌మాల్‌లో పనిచేస్తుండగా ఘటన
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఆరు నెలల కిందటే ఎంఎస్ కోసం వెళ్లిన విద్యార్థి దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వ రరావు- వాణి నగరంలోని రాపర్తినగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె ప్రియ, కుమారుడు సాయితేజ సంతానం. ఉన్నత చదువుల కోసం పిల్లలు ఇద్దరినీ అమెరికా పంపించారు. కుమార్తె ప్రియ నాలుగు సంవత్సరాలుగా అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటోంది. కుమారుడు సాయి తేజ(22) ఈ ఏడాది జూన్ 23న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో కాన్క్రోడియా యూనివర్సిటీలో ఎంఎస్ చదువు కోసం వెళ్లాడు. సాయి తేజ విస్కాన్సిన్‌లో మిల్వాకీ షాపింగ్ మాల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి కొంత మంది దుండగులు షాపింగ్ మాల్‌లోకి వచ్చారు. సాయి తేజను డబ్బులు డిమాండ్ చేశారు. తన వద్ద ఉన్న నగదు ఇచ్చినప్పటికీ దుండగులు కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధుమిత్రులు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఖమ్మంలో వారి ఇంటివద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సాయితేజ అందరితో కలిసిపోయి సరదాగా ఉండేవారని బంధువులు, స్థానికులు గుర్తు చేసుకున్నారు. సాయి మరణం జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీటిపర్యతమయ్యారు.