– తాజా దాడుల్లో 39మంది పాలస్తీనియన్లు మృతి
గాజా: వరుస దాడులతో ఖాన్ యూనిస్ నగరాన్ని శవాల కుప్పగా, శిధిలాల దిబ్బగా మార్చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ మళ్లీ ఆ నగరంపైనే గురి పెట్టింది. తూర్పు ప్రాంతంలో కొత్తగా జరిపిన దాడుల్లో 39మంది పాలస్తీనియన్లు మరణించగా, డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. గాజాలోని పాలస్తీనా పౌర రక్షణ దళాలను ఖాళీ చేయాల్సిందిగా మిలటరీ ఆదేశాలు జారీ చేసిన కొద్ది నిముషాలకే ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది. శతఘ్ని గుళ్ళ వర్షాన్ని కురిపించింది. హమాస్ అదుపులో వున్న బందీల్లో మరో ఇద్దరు మరణించారని ఇజ్రాయిల్ కేంపైన్ గ్రూపు హోస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరమ్ సోమవారం ప్రకటించింది. 35ఏళ్ల సౌండ్ టెక్నీషియన్ యాగెవ్, వృద్ధుడు, చరిత్రకారుడైన అలెక్స్(76)ల మృతిపై దర్యాప్తు జరుపుతున్నామని మిలటరీ ప్రకటించింది. గతేడాది అక్టోబరు 7న జరిగిన దాడిలో వారిని వారి ఇళ్ళ నుండి అదుపులోకి తీసుకున్నారు. చర్చలు ప్రారంభించినా ఎటూ తేల్చకుండా వారాల తరబడి కాలయాపన చేసిన ఫలితమే ఈ బందీల మృతి అని ఫోరమ్ వ్యాఖ్యానించింది. గత 9మాసాలుగా సాగుతున్న దాడుల్లో ఇప్పటివరకు గాజాలో మరణించిన వారి సంఖ్య 39006కి చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 89,818కి చేరుకుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వెస్ట్ బ్యాంక్‌లో జరుగుతున్న దాడుల్లో మృతుల్లో పిల్లలే ఎక్కువగా వుంటున్నారని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. సగటున ప్రతి రెండు రోజులకు ఒక పాలస్తీనియన్ ఛైల్డ్ మరణిస్తున్నారని తెలిపింది. ఇప్పటివరకు 143మంది పిల్లలు చనిపోయారని పేర్కొంది. గత 24గంటల్లో 23మంది పాలస్తీనియన్లు మరణించగా, 91మంది గాయపడ్డారని తెలిపింది. సోమవారం ఉదయం గాజాలో మరో మూడు దాడులు జరిగాయని తెలిపింది. సెంట్రల్ గాజాలో ఇజ్రాయిల్ మిలటరీ ప్రాంతంలో తమ సాయుధ విభాగం ఖసమ్ బ్రిగేడ్స్ స్వల్ప శ్రేణి క్షిపణులతో దాడులు జరిపినట్లు హమాస్ తెలిపింది.