ఖవాజ శతకం

– తొలి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం
– ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 255/4
– ఆసీస్‌, భారత్‌ నాల్గో టెస్టు తొలి రోజు
ఎట్టకేలకు అందివచ్చిన ఫ్లాట్‌ వికెట్‌పై కంగారూలు కంగారు లేకుండా పరుగులు పిండుకున్నారు. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 255/4తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజ (104 బ్యాటింగ్‌) అజేయ శతకంతో కదం తొక్కగా.. కామెరూన్‌ గ్రీన్‌ (49 బ్యాటింగ్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మహ్మద్‌ షమి (2/65) రెండు వికెట్లకు తోడు అశ్విన్‌, జడేజా మాయ చేసినా.. తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
భారత్‌లో రెండు పర్యటనలు. ఎనిమిది టెస్టుల్లో బెంచ్‌కు పరిమితమై డ్రింక్స్‌ మోసుకెళ్లిన ఉస్మాన్‌ ఖవాజ.. చివరగా అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. భారత్‌పై అహ్మదాబాద్‌ టెస్టులో అజేయ శతకంతో చెలరేగాడు. బౌలర్లపై ఎదురుదాడి చేయాలనే ఈగోను దూరం పెట్టిన ఖవాజ (104 బ్యాటింగ్‌, 251 బంతుల్లో 15 ఫోర్లు) సంప్రదాయ ఇన్నింగ్స్‌తో సెంచరీ కొట్టాడు. కామెరూన్‌ గ్రీన్‌ (49 నాటౌట్‌, 64 బంతుల్లో 8 ఫోర్లు), ట్రావిశ్‌ హెడ్‌ (32), స్టీవ్‌ స్మిత్‌ (38) సైతం రాణించటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 255/4తో భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి (2/65) రాణించాడు. ఐదో వికెట్‌కు 19.2 ఓవర్లలో 85 పరుగులు జోడించిన ఖవాజ, కామెరూన్‌ జోడీ.. చివరి సెషన్లో ఆసీస్‌ పరం చేసింది!.
తొలి సెషన్‌ : ఆసీస్‌ ఓపెనర్ల మెరుపులు
టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. సిరీస్‌లో టాస్‌ నెగ్గిన జట్టు మ్యాచ్‌ నెగ్గిన సంప్రదాయం లేదు. అయినా, ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌కు మొగ్గుచూపించింది. ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (32, 44 బంతుల్లో 7 ఫోర్లు), ఉస్మాన్‌ ఖవాజ (00) తొలి వికెట్‌కు శుభారంభం అందించారు. ఇండోర్‌ ఊపులో ఉన్న ట్రావిశ్‌ హెడ్‌.. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడేందుకు మొగ్గు చూపాడు. మరో ఎండ్‌లో ఉస్మాన్‌ ఖవాజ ఎంతో సహనంగా బ్యాటింగ్‌ చేశాడు. ఏడు ఫోర్లతో మెరిసిన ట్రావిశ్‌ హెడ్‌..తొలి గంట ఆసీస్‌ పరం చేశాడు. ఓపెనర్లు రాణించటంతో డ్రింక్స్‌ విరామానికి ఆస్ట్రేలియా 56/0తో మంచి స్థితిలో నిలిచింది. కొత్త బంతితో 14 ఓవర్లు సంధించినా భారత్‌కు వికెట్‌ బ్రేక్‌ లభించలేదు. విరామం అనంతరం భారత్‌ రేసులోకి వచ్చింది. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ వలలో చిక్కుకున్న ట్రావిశ్‌ హెడ్‌.. పెవిలియన్‌కు చేరుకున్నాడు. తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్న జడేజా.. ఆసీస్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. ఫామ్‌లో ఉన్న నం.3 బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ (3) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. అద్భుతమైన బంతితో దూసుకొచ్చిన మహ్మద్‌ షమి.. లబుషేన్‌ వికెట్‌ను గాల్లో గిరాటేశాడు. ఆఫ్‌ సైడ్‌ పడిన బంతి సీమ్‌ ప్రభావంతో లబుషేన్‌ బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య గ్యాప్‌లోకి దూసుకెళ్లి లెగ్‌ వికెట్‌ను గిరాటేసింది. రెండు వరుస వికెట్లతో మ్యాచ్‌ మళ్లీ సమతూకంలోకి వచ్చింది. లంచ్‌ విరామానికి ఆస్ట్రేలియా 75/2తో నిలిచింది. ఓపెనర్‌ ఖవాజ, కెప్టెన్‌ స్మిత్‌ క్రీజులో నిలిచారు. ఈ సెషన్‌లో ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 29 ఓవర్లలో 75 పరుగులు చేసింది.
రెండో సెషన్‌ : ఖవాజ, స్మిత్‌ అడ్డుగోడ
లంచ్‌ విరామం అనంతరం భారత్‌ మరింత ఉత్సాహంగా వికెట్ల వేట సాగిస్తుందని అనుకుంటే.. పరిస్థితి పూర్తి భిన్నంగా సాగింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజతో కలిసి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (38, 135 బంతుల్లో 3 ఫోర్లు) భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. క్రీజులో నిలబడి వికెట్లకు అడ్డుగోడ కట్టిన స్మిత్‌.. ఖవాజకు గొప్ప సహకారం అందించాడు. స్మిత్‌ బౌలర్లను విసిగించగా ఖవాజ తెలివిగా పరుగులు రాబట్టాడు. రెండో సెషన్‌ డ్రింక్స్‌ విరామ సమయానికి ఆసీస్‌ 110/2తో మెరుగ్గా నిలిచింది. ఆ తర్వాత సైతం స్మిత్‌, ఖవాజ డిఫెన్స్‌ను భారత బౌలర్లు ఛేదించలేదు. 9 ఫోర్ల సాయంతో 146 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన ఖవాజ ఆస్ట్రేలియా శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఖవాజ, స్మిత్‌ జోడీ మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించింది. రెండో సెషన్‌లో భారత్‌కు వికెట్‌ నిరాకరించిన ఈ జోడీ.. ఆసీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపించింది. టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 149/2తో పటిష్టంగా కనిపించింది. ఈ సెషన్‌లో ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 33 ఓవర్లలో 74 పరుగులు చేసింది.
మూడో సెషన్‌ :
తొలి రోజు ఆట భారత్‌ చేజారుతున్న తరుణంలో టీమ్‌ ఇండియా పుంజుకుంది. మూడో సెషన్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు నేలకూల్చింది. స్టీవ్‌ స్మిత్‌ ఆత్మవిశ్వాసంతో ఆడుతుండగా.. రవీంద్ర జడేజా ఓ సాధారణ బంతితో అతడికి కథకు ముగింపు పలికాడు. ఫోర్త్‌ వికెట్‌ దిశగా వెళ్తోన్న బంతిని అడ్డంగా ఆడేందుకు ప్రయత్నించిన స్మిత్‌ బంతిని ప్యాడ్‌పైకి ఆడుకున్నాడు. ఫలితంగా బంతి వికెట్లను ముద్దాడింది. దీంతో స్మీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ అనూహ్యంగా ముగిసింది. పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (17, 27 బంతుల్లో 3 ఫోర్లు)ను మహ్మద్‌ షమి మ్యాజిక్‌ బాల్‌తో సాగనంపాడు. లెగ్‌ సైడ్‌ ప్రణాళికతో ఆడుతున్న పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ డిఫెన్స్‌ను మహ్మద్‌ షమి ఛేదించాడు. అతడి వికెట్లను కూల్చేశాడు. దీంతో 170 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాల్గో వికెట్‌ కోల్పోయింది.
తొలి రోజు ఆట చివరి 15 ఓవర్లలో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. డ్రింక్స్‌ విరామం అనంతరం భారత బౌలర్లు వికెట్ల వేటలో విఫలమయ్యారు. ఇదే సమయంలో కామెరూన్‌ గ్రీన్‌, ఉస్మాన్‌ ఖవాజ పరుగుల వరద పారించారు. కామెరూన్‌ గ్రీన్‌ దూకుడుబు బౌండరీలు రాబట్టగా.. ఖవాజ క్లాస్‌ షో కొనసాగించాడు. షమి వేసిన తొలి రోజు ఆఖరు ఓవర్లో బౌండరీ బాదిన ఖవాజ.. 246 బంతుల్లో శతకం సాధించాడు. సిరీస్‌లో ఆసీస్‌ తరఫున నమోదైన ఏకైక సెంచరీ ఇన్నింగ్స్‌ ఇదే కావటం విశేషం. చివరి సెషన్లో 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 28 ఓవర్లలోనే 106 పరుగులు పిండుకుంది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : ట్రావిశ్‌ హెడ్‌ (సి) జడేజా (బి) అశ్విన్‌ 32, ఉస్మాన్‌ ఖవాజ బ్యాటింగ్‌ 104, మార్నస్‌ లబుషేన్‌ (బి) షమి 3, స్టీవ్‌ స్మిత్‌ (బి) జడేజా 38, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (బి) షమి 17, కామెరూన్‌ గ్రీన్‌ బ్యాటింగ్‌ 49,
ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (90 ఓవర్లలో 4 వికెట్లకు) 255.
వికెట్ల పతనం : 1-61, 2-72, 3-151 , 4-170,
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 17-2-65-2, ఉమేశ్‌ యాదవ్‌ 15-2-58-0, రవిచంద్రన్‌ అశ్విన్‌ 25-8-57-1, రవీంద్ర జడేజా 20-2-49-1, అక్షర్‌ పటేల్‌ 12-4-14-0, శ్రేయస్‌ అయ్యర్‌ 1-0-2-0.
75 వసంతాల మైత్రీ సంబురం
భారత్‌, ఆస్ట్రేలియా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు హాజరయ్యారు. భారత ప్రధాని నరెంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోని ఆల్బనిస్‌లు అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో సందడి చేశారు. భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ స్నేహ బంధానికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా.. 75 ఏండ్ల క్రికెట్‌ మైత్రిని ఇద్దరు ప్రధానులు సెలబ్రేట్‌ చేశారు. బాహుబలి స్టేడియంలో ల్యాప్‌ ఆఫ్‌ హానర్‌ తీసుకున్న మోడీ, ఆంటోనిలు.. టాస్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లను క్యాప్‌లు అందజేశారు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ప్రధాని మోడీ టోపీ అందివ్వగా.. తాత్కాలిక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు ఆ దేశ ప్రధాని ఆంటోని బ్యాగీ గ్రీన్‌ టోపీ అందించారు. అనంతరం ఇరువురు ప్రధానులు ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రుల రాకతో నాల్గో టెస్టు మ్యాచ్‌ టాస్‌ కాస్త ఆలస్యమైంది. గ్రామీ అవార్డు గ్రహీత ఇండో అమెరికన్‌ గాయకుడు ఫాల్గుణి షా పలు పాపులర్‌ గీతాలను ఆలపించగా, స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనిని సత్కరించగా, భారత ప్రధాన మంత్రి నరెంద్ర మోడిని బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా సన్మానించారు. కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు, గుజరాత్‌ క్రికెట్‌ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.