ఖోఖో ప్రపంచకప్‌కు వేళాయె

Khokho is ready for the World Cup– తొలి వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం
– నేడు న్యూఢిల్లీలో ఆరంభ మ్యాచ్‌
భారత సంప్రదాయ క్రీడల్లో ఖోఖో ఒకటి. ఇటీవల కమర్షియల్‌ లీగ్‌తో మార్కెట్‌ను ఆకర్షించే ప్రయత్నం చేసిన ఖోఖో.. ఓ అడుగు ముందుకేసి తొలిసారి ప్రపంచకప్‌కు సిద్ధమైంది. పురుషులు, మహిళల విభాగంలో ఏకకాలంలో జరుగుతున్న వరల్డ్‌కప్‌ నేటి నుంచి ఆరంభం కానుంది. చారిత్రక ఖోఖో ప్రపంచకప్‌కు న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ స్టేడియం వేదిక కానుంది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
తొలి ఖోఖో ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. నేడు ఇంధిరాగాంధీ స్టేడియంలో భారత్‌, నేపాల్‌ మ్యాచ్‌తో ఖోఖో చరిత్రలో ప్రథమ ప్రపంచకప్‌కు నాంది పలుకనుంది. ప్రపంచవ్యాప్తంగా 39 జట్లు పోటీపడుతున్న ఖోఖో ప్రపంచకప్‌ అంతర్జాతీయ అభిమానులను ఆకర్షించేందుకు ఎదురుచూస్తోంది. నేడు ఆరంభ వేడుకలతో పాటు తొలి మ్యాచ్‌ జరుగనుండగా.. మంగళవారం నుంచి గ్రూప్‌ దశ మ్యాచులు నిర్వహిస్తారు. గ్రూప్‌ దశ మ్యాచులు 16న ముగియనుండగా.. 17 నుంచి నాకౌట్‌ మ్యాచులు షురూ కానున్నాయి. 19న పురుషుల, మహిళల విభాగంలో టైటిల్‌ పోరు జరుగుతుంది. ఖోఖో ప్రపంచకప్‌ మ్యాచులు స్టార్‌స్పోర్ట్స్‌, దూరదర్శన్‌లో ప్రసారం అవుతాయి.
గ్రూప్‌-ఏలో భారత్‌ : పురుషుల విభాగంలో 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు ఇతర నాలుగు జట్లలో రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో పోటీపడతాయి. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య భారత్‌ గ్రూప్‌-ఏలో నిలిచింది. నేపాల్‌, పెరూ, బ్రెజిల్‌, భూటాన్‌లు సైతం గ్రూప్‌-ఏలో ఉన్నాయి. గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా, ఘనా, అర్జెంటీనా, నెదర్లాండ్స్‌, ఇరాన్‌ నిలిచాయి. గ్రూప్‌-సిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, దక్షిణ కొరియా, యుఎస్‌ఏ, పొలాండ్‌ ఉన్నాయి. గ్రూప్‌-డిలో ఇంగ్లాండ్‌, జర్మనీ, మలేషియా, ఆస్ట్రేలియా, కెన్యాలు చోటు చేసుకున్నాయి.
మహిళల విభాగంలో 19 జట్లు : ఖోఖో తొలి ప్రపంచకప్‌ వేటలో మహిళల విభాగంలో 19 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య భారత్‌ గ్రూప్‌-ఏలో నిలిచింది. ఇరాన్‌, మలేషియా, దక్షిణ కొరియాలతో గ్రూప్‌ దశలో ఢకొీంటుంది. గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, కెన్యా, ఉగాండా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గ్రూప్‌-సిలో నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్‌ ఉండగా.. గ్రూప్‌-డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, పొలాండ్‌, పెరూ, ఇండోనేషియా పోటీపడనున్నాయి. మహిళల విభాగంలో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.