నవతెలంగాణ – రాయపర్తి
పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన మంగళవారం మండలంలో బురహన్ పల్లి గ్రామంలో వెలుగు జేసింది. వివరాల్లోకి వెళితే విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు ఉదయం 9 గంటలకు విద్యార్థులు పాఠశాలకు వెళుతుండగా త్రీ వీలర్ ఆటోలో ముగ్గురు బుర్కాలు వేసుకున్న మహిళలు, ఒక్క వ్యక్తి తమను పదేపదే చూశారని మరికొంతసేపటికి వారు పాఠశాల లోపలికి వచ్చి పిల్లలు ఇక్కడే ఉన్నారని అనడంతో క్షణకాలంలో కిడ్నాపర్లను పసిగట్టిన విద్యార్థులు క్లాస్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. విద్యార్థులు భయాందోళనకు గురై గట్టిగా అరిచారు. కొన్ని నిమిషాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది యాకమ్మ అనే మహిళ పాఠశాల లోపలికి వచ్చిందని తర్వాత తాము తరగతి గది తలుపులు తీశామని విద్యార్థులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పాఠశాలకు పోలీసులు వచ్చారు. తదుపరి ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీదేవి, హెడ్ కానిస్టేబుల్ సురేష్ విద్యార్థులతో మాట్లాడుతూ అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తుల వాహనాలను ఎక్కవద్దని అవసరమైతే 100 నెంబరుకు ఫోన్ చేయాలని హితబోధ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భద్రతకు నిలయాలు.. ఉపాధ్యాయులు పాఠశాల టైం టేబుల్ కంటే ఉదయం అర్ధగంట ముందే పాఠశాలకు రావాలని ఆదేశాలు జారీ చేశాము. పాఠశాల పరిసరాల్లో అపరిచితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. తల్లిదండ్రులు సైతం పిల్లలను పాఠశాలకు పంపించే సమయంలో తోడుగా వస్తే బాగుంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడవలసిన అవసరం లేదు పాఠశాలలో విద్యార్థులకు భద్రత తప్పకుండా ఉంటుంది. మండలంలో ప్రతి పాఠశాలను ప్రతిరోజు నోడల్ ఆఫీసర్స్, ప్రత్యేక అధికారులు విజిట్ చేయడం జరుగుతుంది.