బాలిక కిడ్నాప్‌.. లైంగికదాడికి యత్నం

– తప్పించుకున్న బాధితురాలికి ట్రాన్స్‌జెండర్‌ సహాయం
నవతెలంగాణ- హయత్‌నగర్‌
ఇద్దరు యువకులు బాలికను కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి యత్నించగా.. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఓ ట్రాన్స్‌జెండర్‌ సహాయంతో తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సాయిశ్రీ వివరాలు వెల్లడించారు. పెద్ద అంబర్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కుటుంబానికి చెందిన బాలిక 10వ తరగతి చదువుతున్నది. మంగళవారం రాత్రి ఆమె బాత్‌రూమ్‌ కోసం బయటకు రాగా.. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అడ్రస్‌ చూపిస్తూ.. అడిగారు. బాలిక విషయం చెబుతుండగానే బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ లైంగికదాడికి యత్నించగా.. వారి నుంచి తప్పించుకున్న బాలిక విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ఓ హౌటల్‌ వద్దకు చేరుకుంది. ఓ ట్రాన్స్‌జెండర్‌ బాలికను గమనించి విషయం తెలుసుకుని.. తన ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందజేసింది.