హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్‌

– ఘట్కేసర్‌లో ఒకరు.. సికింద్రాబాద్‌లో మరొకరు..
– ఒకరిని రక్షించిన పోలీసులు.. మరొకరి కోసం గాలింపు
నవతెలంగాణ-ఘట్కేసర్‌
హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం సృష్టించాయి. ఒకరిని పోలీసులు గంటల వ్యవధిలోనే రక్షించగా.. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకెళ్తే.. ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఘట్కేసర్‌ ఈడబ్ల్యుఎస్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో భరత్‌- రాజేశ్వరి కుటుంబం నివాసముంటోంది. వారి కుమార్తె కృష్ణవేణి బుధవారం రాత్రి చాక్లెట్‌లు కొనుక్కోవడానికి బయటకు రాగా.. సురేష్‌ అనే యువకుడు కిడ్నాప్‌ చేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చిన్నారితో ఉన్న నిందితున్ని రైల్వే పోలీసులు అనుమానించి విచారించగా కిడ్నాప్‌ విషయం బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకుని గురువారం మధ్యాహ్నం ఘట్కేసర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌, మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేష్‌ రెడ్డి, సీఐ మహేందర్‌ రెడ్డి చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక పోలీసు బలగాలు 24 గంటల్లోపు కిడ్నాపర్‌ను పట్టుకున్నారని, వారిని అభినందించారు. కొందరు యువకుల సహకారంతో నిందితున్ని త్వరగా పట్టుకోగలిగామని చెప్పారు.
ఇదిలా ఉండగా, సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏడు నెలల చిన్నారి అపహరణకు గురయ్యాడు. సీఐ మురళీధర్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పింకీదేవి- అజరు దంపతులు పటాన్‌చెరులోని ఇస్నాపూర్‌లో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన వారు ఈనెల 4న తమ స్వగ్రామానికి వెళ్లేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో దంపతులిద్దరూ మద్యం మత్తులో ఉండి గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారి ఏడు నెలల కొడుకు కన్నయ్య కనిపించకుండా పోయాడు. రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో వారు వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.. గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రెండు టీంలుగా ఏర్పడి బాలుడి కోసం గాలిస్తున్నారు. ఓ మహిళ బాలున్ని తీసుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు ఆమె చెన్నరుకి చేరుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.