కిడ్నీ రాకెట్‌ !

Kidney racket!– అపోలో ఆస్పత్రులపై టెలిగ్రాఫ్‌ ఆరోపణలు
– తోసిపుచ్చిన యాజమాన్యం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌లో అపోలో ఆస్పత్రుల ప్రమేయం ఉన్నదని బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్‌ పత్రిక ఆరోపించింది. డబ్బు కోసం మయన్మార్‌కు చెందిన పేదలను కిడ్నీలు అమ్ముకునేలా అపోలో ఆస్పత్రులు ప్రలోభపెట్టాయని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి గ్రూపు మంగళవారం నిర్ద్వద్వంగా తోసిపుచ్చింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, అసత్య సమాచారంతో కూడినవని, ప్రజలను తప్పుదోవపట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇంతకీ టెలిగ్రాఫ్‌ పత్రిక తన పరిశోధనలో ఏం చెప్పిందంటే…
మయన్మార్‌కు చెందిన పేద యువకులను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రపంచంలోని సంపన్నులకు కిడ్నీలు అమ్మితే బోలెడు డబ్బు వస్తుందని వారిని ప్రలోభపెట్టారు. కిడ్నీ దాతలను రోగుల బంధువులుగా చూపేందుకు గుర్తింపు పత్రాలు సృష్టించారు. కుటుంబ ఫొటోలు ప్రదర్శించారు. భారతీయ, బర్మా చట్టాల ప్రకారం రోగులు కొత్త వారి నుండి ఎలాంటి అవయవాలను స్వీకరించకూడదు.
దాతలను ఎలా గుర్తిస్తారంటే…
టెలిగ్రాఫ్‌ విచారణలో భాగంగా ఆ పత్రిక రిపోర్టర్‌ ఒకరు రోగి బంధువుగా అవతారం ఎత్తారు. ఆ రోగికి అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంది. అయితే ఆమెకు కిడ్నీ దానం చేయడానికి కుటుంబసభ్యులెవరూ లేరు. ఆ రిపోర్టర్‌ అపోలో మయన్మార్‌ కార్యాలయానికి వెళ్లారు. మీరు ఆ రోగికి కిడ్నీ ఇవ్వవచ్చునని అక్కడి వారు ఆయనకు చెప్పారు. ఇందుకు అంగీకరించిన రిపోర్టర్‌ను అపోల్‌ ఏజెంట్‌ 27 సంవత్సరాల బర్మా యువకుడిగా మార్చేశాడు. వృద్ధులైన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున కిడ్నీ అమ్మాల్సి వస్తోందని చెప్పాలని సూచించాడు. రోగి తన దాతను ఎంచుకోవచ్చునని కూడా చెప్పాడు. కిడ్నీ ఇచ్చినందుకు డబ్బు ముడుతుందని తెలిపాడు.
ఎంత ఖర్చవుతుంది?
అపోలో మయన్మార్‌ అధిపతి రిపోర్టర్‌కు అపోల్‌-బ్రాండెడ్‌ వ్యయ పత్రాన్ని అందించాడు. కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చుల వివరాలు ఆ పత్రంలో ఉన్నాయి. విమాన ప్రయాణం, మెడికల్‌ బోర్డు రిజిస్ట్రేషన్‌ తదితర ఖర్చులన్నింటినీ కలిపి రూ.91,700గా చూపారు. రోగి రూ.1,79,500 భరిస్తాడని కూడా ఆ పత్రంలో వివరించారు. అయితే కిడ్నీ ఇచ్చే వారికి రోగి అందించే మొత్తాన్ని (అనేక కేసుల్లో రూ.70 నుండి రూ.80 లక్షలు) ఇందులో చూపలేదు.
ఏం జరిగిందంటే…
పత్రంలో చూపిన సొమ్ము అందగానే రిపోర్టర్‌ భారత్‌కు వచ్చారు. ఆయన తన తల్లిదండ్రులతో కలిసి ఇంటర్వ్యూ కోసం ట్రాన్స్‌ప్లాంట్‌ ఆథరైజేషన్‌ కమిటీ ఎదుట హాజరయ్యారు. తనకు సమర్పించిన పత్రాలను పరిశీలించడం, రోగి-దాత మధ్య ఉన్న బంధుత్వాన్ని ధృవీకరించుకోవడం కమిటీ బాధ్యత. కమిటీలో కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ అధికారి, ఇద్దరు రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారులు, ఇద్దరు ఆస్పత్రి కన్సల్టెంట్లు సభ్యులుగా ఉంటారు. అపోలో ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు కమిటీలో సభ్యులుగా ఉంటారని, రోగి-దాత బంధుత్వంపై సాధారణ ప్రశ్నలు వేస్తారని అపోలో మయన్మార్‌ ఏజెంట్లలో ఒకరు రిపోర్టర్‌కు చెప్పాడు. రోగికి, దాతకు మధ్య బంధుత్వాన్ని నిరూపించే పత్రాలు, ఫొటోలను ఆ ఏజెంటే సృష్టించాడు.
వైద్యుల ప్రమేయం
డాక్టర్‌ సందీప్‌ గులేరియా పేరును టెలిగ్రాఫ్‌ తన నివేదికలో ప్రస్తావించింది. గులేరియా బ్రిటన్‌లో శిక్షణ పొందారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. గులేరియా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తారని రోగులు, ఏజెంట్లు టెలిగ్రాఫ్‌కు తెలిపారు. కాగా అపోలో ఢిల్లీ ఆస్పత్రితో సంబంధమున్న మరో కిడ్నీ కుంభకోణంలో ప్రశ్నించేందుకు గులేరియాను ప్రశ్నించే అవకాశం ఉన్నదని 2016లో డెక్కన్‌ హెరాల్డ్‌ వార్తాపత్రికలో వచ్చిన ఓ నివేదికను టెలిగ్రాఫ్‌ ఉటంకించింది. కిడ్నీ రాకెట్‌తో సంబంధమున్న ఇంద్రప్రస్థ ఆస్పత్రిలోని ఇద్దరు అపోలో సచివాలయ సిబ్బందిని, కొందరు బ్రోకర్లను, కిడ్నీ దాతలను 2016లో అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితులపై విచారణ ఇంకా పూర్తికాలేదు.