మార్చి 10న ‘కిడ్నీ’రన్‌

– పోస్టర్‌ ఆవిష్కరించిన వైద్యులు
– అందరికీ కిడ్నీ ఆరోగ్యమే లక్ష్యం
– ఆ దిశగా అవగాహన పెంచేందుకు రన్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా మార్చి 10వ తేదీన ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో కిడ్నీరన్‌ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆస్పత్రి ప్రాంగణంలో ఆవిష్కరించారు. అన్ని వయస్సుల వారూ తమ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ కిడ్నీరన్‌ నిర్వహిస్తున్నట్టు ఏఐఎన్‌యూ ఆస్పత్రి హైటెక్‌ సిటీ శాఖ అధిపతి, సీనియర్‌ కన్సల్టెంట్‌ యూరాలజిస్టు డాక్టర్‌ దీపక్‌ రాగూరి తెలిపారు. ఈ రన్‌ కిడ్నీ ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి, ఆరోగ్యవంతంగా ఉండాలనే సంస్కృతిని పెంపొందించడానికి ఉద్దేశించిన కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమం. కిడ్నీల ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడానికి, ప్రజలను ప్రేరేపించడానికి అంకితమైన కార్యక్రమం ఇది. ఈ రన్‌కు అంబాసిడర్లుగా.. అభినవ్‌ పాఠక్‌, జొహన్నా, శ్రవణ్‌ ద్విభాష్యం, పూనమ్‌ మెట్టా, సుభాష్‌ రెడ్డి, సంతోష్‌ మల్లారెడ్డి, సంతోషి తమ్లుకర్‌, మల్లికార్జున్‌, దేవయాని, పింకీ, రాజ్‌ సీహెచ్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా డాక్టర్‌ దీపక్‌ రాగూరి మాట్లాడుతూ ”ప్రపంచ కిడ్నీ డేను పురస్కరించుకుని ఏషియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీలో కిడ్నీ హెల్త్‌కు పతాకదారులుగా ఉన్న మేం ”ఎఐఎన్‌యూ కిడ్నీ రన్‌” పేరుతో కిడ్నీ ఆరోగ్య అవగాహనను పెంపొందించడానికి వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే నాలుగో ఎడిషన్‌లో మూడు వేల మందికి పైగా రన్నర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది ప్రపంచ కిడ్నీ డే థీమ్‌.. అందరికీ అందుబాటులో కిడ్నీ ఆరోగ్య సంరక్షణ” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ క్రాంతికుమార్‌, కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ వరుణ్‌ మామిడి పాల్గొన్నారు.