పుతిన్‌తో కిమ్‌ కీలక భేటీ!

 Kim's key meeting with Putin!న్యూఢిల్లీ జి-20 సమావేశంలో ఆశించిన విధంగా రష్యాను ఖండిస్తూ తీర్మానం చేయకపోవటంతో ఉక్రోషానికి గురైన ఉక్రెయిన్‌ నోరు పారవేసు కుంది. శిఖరాగ్ర సభ జరిగిన వెంటనే తీర్మానంలో గర్వపడాల్సిందేమీ లేదని వెంటనే విదేశాంగ మంత్రి ప్రకటించగా జెలెనెస్కీ సలహాదారు బుధవారంనాడు నోరు పారవేసుకున్నాడు. భారత్‌, చైనా దేశాలకు మేథోపరమైన సత్తాలేదని, తమ చర్యల పర్యవసానాలేమిటో విశ్లేషించు కోవటంలో విఫలమైనట్లు వ్యాఖ్యానించాడు. వారు శాస్త్రరంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు, భారత్‌ చంద్రుడి మీదకు రోవర్‌ను పంపింది. అది ఇప్పుడు అక్కడ తిరుగుతోంది. అంతమాత్రాన ఆధునిక ప్రపంచం గురించి భారత్‌కు గ్రహింపు ఉందనేందుకు అది సూచిక కాదు అన్నాడు. నాటో కూటమి దేశాల పంజరంలో ఉక్రెయిన్‌ చిలకగా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సభలో తీర్మానం ఆమోదం పొందకపోతే నరేంద్రమోడీకి అవమానం, పశ్చిమ దేశాలు కోరుకున్నట్లుగా రష్యాను విమర్శిస్తూ తీర్మానంలో పొందుపరిస్తే ఏకీభావం ఉండదు, అసలు ప్రకటనలేకపోతే పరువు తక్కువ. అందువలన రష్యా పేరులేకుండా రాజీగా ఉక్రెయిన్‌ సంక్షోభంతో తలెత్తిన పరిస్థితి మీద ఆందోళన వెల్లడించారు. పశ్చిమ దేశాలు మింగా కక్కలేని పరిస్థితిలో తమ కూటమిలోకి భారత్‌ను లాక్కుపోవాలన్న ఎత్తుగడకు అనుగుణంగా రాజీపడి అంగీకరించాల్సి వచ్చింది.
ఉక్రెయిన్‌ మీద సైనిక చర్య అంశంలో తటస్థ వైఖరితో ఉన్నప్పటికీ చైనా నాయకత్వం ఇటీవలి కాలంలో రష్యాకు అనేక విధాలుగా దగ్గర అవుతున్న సంగతి తెలిసిందే. అందువలన చైనా మీద పట్టలేని ఆగ్రహం కలిగి ఉండటం అర్థం చేసుకోవచ్చు. కానీ భారత గడ్డమీద తీర్మానం ఆమోదించినందున మన దేశాన్ని కూడా తూలనాడారాన్నది వేరే చెప్పనవసరం లేదు. దీని మీద మనదేశం వెంటనే స్పందించలేదు గానీ సంజాయిషీ ఇవ్వాలని వెంటనే చైనా డిమాండ్‌ చేసింది. దాంతో 24 గంటలు గడవక ముందే గురువారంనాడు ఉక్రెయిన్‌ వివరణ ఇచ్చుకుంది. పోనీ దానిలోనైనా నిజాయితీ ఉందా అంటే అదీ లేదు. మరో రూపంలో నిందను సమర్థించుకుంది. తుర్కియే, భారత్‌, చైనా ఇతర ప్రాంతీయ శక్తులు ఆధునిక ప్రపంచంలో తమ ప్రపంచ పాత్ర గురించి అవి చెప్పుకుంటున్నది సమర్థనీయమే. ఈ పాత్ర రష్యా కంటే మరింత దీర్ఘ, విస్తృతమైనదే కావచ్చుగానీ ప్రాంతీయ జాతీయ ప్రయోజనాలకంటే ప్రపంచ ప్రయోజనాలు విశాలమైనవంటూ ముక్తాయించిన తీరు అంతకు ముందు చేసిన విమర్శను పునరుద్ఘాటించటం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాల పెంపుడు చిలక ఇలా నోరుపారవేసుకుందంటే దాని యజమానుల మద్దతు లేకుండా అలా మాట్లాడి ఉండదన్నది స్పష్టం.
ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలై గురువారం నాటికి 568రోజులు నిండాయి. దాన్ని పరిష్కరించేందుకు పశ్చిమ దేశాలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నప్పటికీ అది అసాధ్యం కాదు. కానీ అవి అందచేస్తున్న ఆధునిక అస్త్రాలతో జెలెనెస్కీ సేనలు దాడులకు పాల్పడుతున్నాయి. 2014 నుంచి రష్యా ఆధీనంలోకి వచ్చిన క్రిమియా ద్వీప తీరంలోని నల్ల సముద్రంలో రష్యా నౌకా దళం మీద ఆధునిక డ్రోన్లతో దాడులకు పాల్పడటం, వాటికి ప్రతిగా రష్యా క్షిపణి ప్రయోగం జరుగుతున్నది. బుధవారంనాడు వ్లదిమిర్‌ పుతిన్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ రష్యాలోని తూర్పు అమూర్‌ ప్రాంతంలో ఉన్న వాస్టోచినీ కాస్మోడ్రోమ్‌ (అంతరిక్ష కేంద్రం) వద్ద నాలుగు గంటల పాటు భేటీ జరిపారు. నాలుగు సంవత్సరాల తరువాత ఈ ఇద్దరి నేతల మధ్య జరిగిన సమావేశం పశ్చిమ దేశాలకు ఒక హెచ్చరిక అని పరిశీలకులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ పేరు ప్రస్తావించకుండానే రష్యా జరుపుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక పోరుకు తాము ఎల్లవేళలా గట్టి మద్దతు ఇస్తున్నట్లు కిమ్‌ ప్రకటించాడు. ఈ భేటీ గురించి సహజంగానే అమెరికా, బ్రిటన్‌ గుండెలు బాదుకున్నాయి. రష్యాకు గనుక ఉత్తర కొరియా ఆయుధాలను విక్రయిస్తే తాము గట్టిగా వ్యవహరిస్తామని అమెరికా బెదిరించింది. సంక్షోభంలోకి బ్రిటన్‌ దిగుతోంది, దాని బదులు ఉక్రెయిన్‌కు ఆయుధాలను మరింత వేగంగా అందించాలని మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నాడు. వారు కోరుతున్నది ఆయుధాలు, మన కాళ్లకు బురద ఎందుకు అని ప్రశ్నించాడు. ఇవి ఉడుత ఊపులు తప్ప చేసేదేమీలేదని విశ్లేషకులు పేర్కొన్నారు. నిరంతరం ఉక్రెయిన్‌ ఆయుధాలు విక్రయిస్తున్న అమెరికాకు ఇతర దేశాలను తప్పు పట్టే నైతిక హక్కు ఎక్కడుంది? ఇప్పటికైనా మంటను ఎగదోయటం మానుకొని పరిష్కారానికి పూనుకోవాలని ప్రపంచ శాంతి శక్తులు ఒత్తిడి తేవాలి.