హాస్యానికి రారాజు

ఆనాటి హాస్య నటులైన బాలకృష్ణ, రేలంగి, రమణారెడ్డి నుండి కోట, బ్రహ్మానందం, అలీ, సుత్తివేలు, సుత్తివీరభద్రరావు, ధర్మవరపు, సునీల్‌ వంటి ఈనాటి హాస్య నటులతోనూ నటించిన ఏకైక హాస్య నటుడు అల్లురామలింగయ్య. ”ఆమ్యామ్యా, అప్పుమ్‌ అప్పుమ్‌…’ వంటి ఊత పదాలు అల్లు రామలింగయ్య సృష్టించినవే.
అల్లు వెంకయ్య, సత్తెమ్మ దంపతులకు 1922 అక్టోబర్‌ 1 పాలకొల్లులో జన్మించారు అల్లు రామలింగయ్య. ఈయనకి ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు వున్నారు. పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామికి గుర్తుగా ఆయనకు ఆ పేరు పెట్టారు. రామలింగయ్య తాత అల్లు సుబ్బారాయుడు పాలకొల్లులో పెద్ద ఆస్తిపరుడు. ఆయన విచ్చలవిడి దానధర్మాలతో ఆస్తులన్నీ కరిగిపోయాయి. అయితే రామలింగయ్య తండ్రి వెంకయ్య బాగా కష్టపడి వ్యవసాయం చేసి మళ్లీ కొంత వరకు ఆస్తులు కూడబెట్టారు. రామలింగయ్య చదువుమీద ఆసక్తిలేక స్కూల్‌కి పెద్దగా వెళ్లలేదు. తన చుట్టుపక్కలవారిని ఇమిటేట్‌ చేస్తూ అందరినీ నవ్వించేవారు. ఎక్కువగా పాలకొల్లుకు వచ్చే నాటకాల వారితో తిరుగుతూ నాటకాలు వేస్తానని, ఒక చిన్న వేషమైనా ఇవ్వమని వారిని అడిగేవారట. చివరికి నాటకాల మేనేజర్‌ రామలింగయ్య పోరు పడలేక ‘మూడు రూపాయలిస్తే భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం ఇస్తానని చెప్పారట. అప్పుడు రామలింగయ్య ఇంట్లో వారికి తెలీకుండా బియ్యం అమ్మి మూడు రూపాయలు సంపాదించి నాటకాల మేనేజర్‌కి ఇచ్చి, ఆ నాటకం వేశారు. ఆ నాటకంలో డైలాగులన్నీ వేరే వారితో చదివించుకుని గుర్తుపెట్టుకున్నారు. అప్పటి వరకు నాటకాల అనుభవం లేకపోయినా తన సహజ సిద్ధ నటనతో అందరినీ మెప్పించారు. అలా తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఏం పని చేయకుండా నాటకాలంటూ తిరుగుతున్నారని రామలింగయ్యకి కనకరత్నంతో పెళ్లిచేశారు ఇంట్లోవారు. పెళ్లి తర్వాత కూడా నాటకాలు వేస్తూనే వున్నారాయన. అదే సమయంలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కారణంగా చాలామందిని అరెస్ట్‌ చేసింది బ్రిటీష్‌ ప్రభుత్వం. అందులో రామలింగయ్య కూడా వున్నారు. జైల్లో కూడా తన తోటి వారిని పోగేసి నాటాకాలు వేసేవారు అల్లు. ఆంధ్ర ప్రజానాట్యమండలిలో చేరి అక్కడ నాటకాలు వేస్తూ ఎన్నో బహుమతులు అందుకున్నారాయన. తీరిక సమయాల్లో హోమియోపతి వైద్యం నేర్చుకుని, తన చుట్టుపక్కల వారికి ఉచితంగా వైద్యం అందించేవారు. నృత్య కళామండలి వారిచే హాస్యకళాప్రపూర్ణ అందుకున్నారు. అప్పుడే గరికపాటి రాజారావు దృష్టిలో పడ్డారు అల్లు. సినిమాల్లో నటిస్తావా అని అడిగిన రాజారావుకి వెంటనే నటిస్తానని చెప్పారట. 1952లో మద్రాసు వెళ్లిన రామలింగయ్యకు ‘పుట్టిల్లు’ చిత్రంలో చిన్న వేషం ఇచ్చారు గరికపాటి. ఆ చిత్రం షూటింగ్‌ సమయంలోనే హెచ్‌.ఎం.రెడ్డి, ఎల్‌.వి.ప్రసాద్‌ తీస్తున్న ‘వద్దంటే డబ్బు, పతివ్రత’ చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. అదే సమయంలో కుటుంబాన్ని మద్రాస్‌ తీసుకొచ్చారు అల్లు. ఆ తరువాత ‘దొంగరాముడు, సంతానం, మిస్సమ్మ, మాయాబజార్‌, భాగ్యరేఖ, తోడికోడళ్లు, అప్పుచేసిపప్పుకూడు’ వంటి చిత్రాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. 1960 వరకు అవకాశాలు వస్తున్నా కూడా పెద్దగా పేరు రాలేదు. 1963లో వచ్చిన ‘మూగమనసులు’ చిత్రంతో రామలింగయ్యకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు, డబ్బు రాసాగింది. 1975 లో వచ్చిన ‘ముత్యాలముగ్గు’ సినిమా షూటింగ్‌ సమయంలో తన రెండో కొడుకు చనిపోయిన వార్త తెలిసింది. అయినా కూడా ఆ దు:ఖాన్ని దాచుకుని, నిర్మాతకు నష్టం రాకూడదని, షూటింగ్‌ పూర్తి చేసుకునే ఇంటికి వెళ్లారట ఆయన. రావుగోపాలరావు, అల్లురామలింగయ్య కాంబినేషన్‌ అంటే అప్పట్లో మంచి క్రేజ్‌ ఉండేది. 1990లో అల్లు ఆర్ట్స్‌ సంస్థను స్థాపించి రావుగోపాలరావు, గొల్లపూడి, సుమలతతో ‘డబ్బు భలే జబ్బు’ సినిమా నిర్మించారు. ఆనాటి హాస్య నటులైన బాలకృష్ణ, రేలంగి, రమణారెడ్డి నుండి కోట, బ్రహ్మానందం, అలీ, సుత్తివేలు, సుత్తివీరభద్రరావు, ధర్మవరపు, సునీల్‌ వంటి ఈనాటి హాస్య నటులతోనూ నటించిన ఏకైక హాస్య నటుడు అల్లురామలింగయ్య. ”ఆమ్యామ్యా, అప్పుమ్‌ అప్పుమ్‌…’ వంటి ఊత పదాలు అల్లు రామలింగయ్య సృష్టించినవే.
ఆయన చివరి సినిమా 2004 లో వచ్చిన ‘జై’. కామెడీ ఆర్టిస్టుగా, కామెడీ విలన్‌గా, సపోర్టింగ్‌ ఆరిస్టుగా, తండ్రి, తాతగా… పలు పాత్రల్లో మొత్తం 1030 సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు అల్లు. ఆరోగ్యం క్షీణించడంతో 2004 జులై 31న తుదిశ్వాస విడిచారు.
యాభై ఏళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ, నవ్విస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు అల్లు రామలింగయ్య. 1990లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రేలంగి తర్వాత పద్మశ్రీ అవార్డు అందుకున్న రెండవ హాస్యనటులు ఈయన. 2001లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2013లో ఈయన పేరుమీద తపాలా బిళ్లలు కూడా వచ్చాయి.