పూర్వం చంద్రగిరిని వీరవర్థనుడు పాలించేవాడు. ఆయన మంత్రి నాగరసు. వీరవర్థనుడి కుమారుడు శూరవర్థనుడు. అలాగే నాగరసు కుమారుడు సోమరసు. రాకుమారుడు, మంత్రికుమారుడు విద్యాభ్యాసం పూర్తయి రాజ్యం చేరాక వీరవర్థనుడు యువరాజుకు పట్టాభిషేకం చేసి, సోమరసుకు మంత్రి బాధ్యతలు అప్పగించాడు. కొత్తరాజు, కొత్త మంత్రి శాస్త్రజ్ఞానం కలవారే కానీ లోకజ్ఞానం లేనివారు. సమస్యల పరిష్కారంలో ఇద్దరిదీ చెరొకదారి. ఈ విషయం వీరవర్థనునికి ఆయనమంత్రికి నచ్చేదికాదు. ఒకరోజు వీరవర్థనుడు వారిద్దరితో ”పాలనకు శాస్త్రజ్ఞానం ఒక్కటే చాలదు. లోకజ్ఞానం కూడా తగినంత కావాలి. మీరిద్దరూ మారువేషాల్లో బయలుదేరి రాజ్యాన్ని చుట్టి రండి. అప్పుడు మీకు రాజ్యంలోని సమస్యలు తెలుస్తాయి” అన్నాడు.
రాజుగారి ఆజ్ఞ కాదనడానికి లేదు. శూరవర్థనుడు, సోమరసు ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరి దేశాటన ప్రారంభించారు. పలు సమస్యలతో ప్రజలు బాధలు పడటం చూశారు. పరిష్కారాలు ఆలోచించారు. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. అలా తిరుగుతూ సిరిపురం అనే గ్రామం చేరారు. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో జోరున వర్షం మొదలయింది. దగ్గరలో కనిపించిన పూరింటిలోకి చేరారు. ఆ యింట్లో ఒక ముసలిరైతు, ఆయన కుటుంబం కాపురం వుంటున్నారు. ఆ చిన్న యింట్లో ఎలాగో సర్దుకుని అతిథులకు వారు చోటిచ్చారు. తమకున్నంతలో వారికి మర్యాదలు చేశారు.
పట్టిన ముసురు మూడురోజులయినా తగ్గలేదు. ఆ మూడురోజులు యువరాజు మంత్రీ ఆ ఇంట్లోనే వుండిపోయారు. రైతు కుటుంబ సభ్యులు అతిథుల్ని బాగానే చూస్తున్నారు కానీ గమనిస్తే రైతు కొడుకులిద్దరిలో సఖ్యత లేదనిపించింది. ఏదైనా సమస్యవస్తే పరిష్కారం వెతికే విషయంలో ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం అంటున్నారు.
వర్షం తగ్గాక ముసలిరైతుకు కృతజ్ఞతలు చెప్పారు. దానికి ముసలి రైతు, ”అందులో గొప్పేం వుందినాయనా! అతిథిదేవోభవ కదా! మా ఇంట్లోవాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తు.చ.తప్పక పాటిస్తారు. కానీ నా కుమారులు ఇంటి విషయాల్లో మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకోరు. ఎంత చెప్పినా వారితీరు మారడంలేదు. భవిష్యత్తులో పాడీపంటా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వారిమీద వుంది. వీరిలావుంటే ఎలా అనేదే నా చింత. ఇంకా నాకున్న పెద్ద చింతఏమంటే… కొత్తరాజు, మంత్రికూడా ఇంతేనంట!. ప్రజలనుకుంటుంటే విన్నాను. ఏ సమస్యపట్లా వారిద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదరదట. ఇంట్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోతే కుటుంబానికి నష్టం. అంత:పురంలో వుండే రాజుకు మంత్రికి మధ్య సఖ్యతలేకపోతే రాజ్యానికే పెద్ధ నష్టం. ఇది వారిద్దరికి చెప్పే ధైర్యం ఎవరికుంటుంది? వారే తెలుసుకుని దిద్దుకోవాలి. కుటుంబమూ రాజ్యం ఒకటే. రెండు చోట్లా సరయిన అవగాహన వుండాలి. అప్ఫుడే సుఖసంతోషాలుంటాయి..” అన్నాడు.
యువరాజు, మంత్రి ముఖాలు నల్లబోయాయి. రాజుగారి అంత:పురంలోని విషయాలు త్వరలోనే ప్రజల్లోకి చేరిపోతాయి. అది సహజం. నివారించను వీలుకాదు. అందువల్ల రాజే ఆదర్శంగా వుండాలి అని ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. రాజధానికొచ్చాక రైతును, ఆయన కొడుకులిద్దరినీ పిలిచి, తగిన విధంగా సత్కరించి, రైతుతో, ”మీ ఆతిథ్యంతో మా మనసును గెలవడమే గాక మీ మాటలతో మా కళ్ళు తెరిపించారు” అంటూ కుమారులవైపు తిరిగి ”మీలోని ఆతిథ్యగుణం అద్భుతం. అయితే మీరు ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడంలేదు.. ఆది సరయిందికాదు. మీ తండ్రి మాటలు మాకెంతో నచ్చాయి. మీరు కూడ ఆయన మాటప్రకారం నడుచుకోండి” అంటూ వారికి కానుకలిచ్చి పంపేశారు. గ్రామానికి చేరిన రైతు కొడుకులిద్దరూ సఖ్యతతో మెలగసాగారు. అలాగే యువరాజు, ఆయన మంత్రీ ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటూ రాజ్యాన్ని చక్కగా పాలించారు. అదిచూసి వీరవర్థనుడు ఆయన మంత్రి సంతోషించారు.
డా. గంగిశెట్టి శివకుమార్