– జనవరి 10 నుంచి 20 వరకు ప్రచారం
– జనవరి 26 దేశవ్యాప్తంగా ట్రాక్టర్స్ మార్చ్
– సంయుక్త కిసాన్ మోర్చా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కిసాన్- మజ్దూర్ జన జాగరణ్ ప్రచారానికి రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక సిద్ధమైంది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) జన జాగరణ్ ప్రచారానికి కరపత్రాన్ని మంగళవారం నాడిక్కడ విడుదల చేసింది. జన జాగరణ్ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌కేఎం సంఘాలతో జనవరి 10 (బుధవారం)న ప్రారంభమవుతుంది. జనవరి 20 వరకు కొనసాగుతుంది. కరపత్రం, బుక్లెట్ అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించనున్నట్లు ఎస్‌కేఎం నేతలు తెలిపారు. ”దేశంలోని తీవ్రమైన కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, యువతను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రచారంలో వివరిస్తుంది. వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించ డానికి, రైతులు, కార్మికులకు మరింత ఆదాయం, స్థిరమైన ఉపాధిని నిర్ధారించడానికి, కార్పొరేట్ లాభదాయకత, దోపిడీని నిరోధించడానికి ఉపాధి, కనీస వేతనంతో కార్మికులకు తగిన ఆదాయం, రైతులకు కనీస మద్దతు కోసం ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాన్ని అవలంభించడం వంటి ప్రాముఖ్యతను ప్రచారం వివరిస్తుంది” అని తెలిపారు.
”ఎస్ కె ఎం కార్యకర్తలు గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికి వెళ్లి ప్రచార ప్రతులను పంపిణీ చేస్తారు. మొట్టమొదటి అఖిల భారత సదస్సులో ఆమోదించిన డిమాండ్ల చార్టర్‌లో రైతులు, కార్మికుల కాంక్రీట్ డిమాండ్ల సాధన కోసం జరిగే పోరాటంలో భారీ మద్దతు, భాగస్వామ్యాన్ని కోరుతారు. దేశంలోని 30.4 కోట్ల కుటుంబాలలో 40 శాతం మందిని కవర్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారం ఉంది. కార్పొరేట్ ఆధారిత అభివృద్ధి, తలసరి ఆదాయం క్షీణించడం, పెరుగుతున్న ఆదాయ అసమానతలు, రైతులకు కనీస మద్దతు ధర, కార్మికులకు కనీస వేతనం వంటి వాటితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, దోపిడి గురించి మోడీ ప్రభుత్వాల కథనాన్ని ఈ ప్రచారం బహిర్గతం చేస్తుంది” అని తెలిపారు.
”జన జాగరణ్ క్యాంపెయిన్‌లో చేరాలని ఎస్‌కెఎం, కేంద్ర కార్మిక సంఘా లు నిర్ణయించాయి. ప్రచారాన్ని సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారం జనవరి 26న దేశ వ్యాప్తంగా జిల్లా స్థాయిలో జరిగే ట్రాక్టర్/వాహన కవాతులో కుటుంబ సభ్యులతో పాటు రైతులు, కార్మికులు పాల్గొనేలా చేస్తుంది” అని తెలిపారు.