– సీబీఐ మాజీ డైరెక్టర్ వ్యాఖ్యలతో సాగునీటి శాఖలో ఆందోళన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా ప్రాజెక్టు వైఫల్యానికి మీరంటే మీరే కారణమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైమరొకరు అరోపణలు, విమర్శలు చేసుకుంటున్న విషయమూ విదితమే. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి ఇటీవల తరచుగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సీబీఐతో విచారణ జరిస్తామంటూ జపంచేస్తున్నారు.
గత వారం రోజుల నుంచి సదరు మంత్రి ఇదే పాట పాడుతున్నారు. కాగా బుధవారం ఢిల్లీలో ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై కేంద్రం, సీబీఐ విచారణ జరుపుతుందంటూ’ పాత పాటనే మళ్లీ కొనసాగించారు. ఈసారీ స్పందన మాత్రం విభిన్నంగా వచ్చింది. దీనికి ఏకంగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందిస్తూ ‘ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదనీ, కేంద్రమే నేరుగా జరపొచ్చని’ వ్యాఖ్యానించారు. కేంద్ర జలశక్తి శాఖే సీబీఐ విచారణను కోరవచ్చని నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. కేంద్రానికి చెందిన 10 ఏజెన్సీలే కాళేశ్వరానికి అనుమతులిచ్చాయని గుర్తు చేశారు. ఈనేపథ్యంలో కేంద్రమే సీబీఐని విచారణకు ఆదేశించవచ్చన్నారు. అవినీతి నిరోధక చట్టం 17(ఎ) ప్రచారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణను కోరవచ్చన్నారు. దీనికి కేసీఆర్ సర్కారు అనుమతి అవసరం లేదని అభిప్రాయపడ్డారు.సీబీఐ విచారణలో రాష్ట్రప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుందని గుర్తు చేశారు. దీంతో కిషన్‌రెడ్డి ఎర్కపోయి ఇర్కునట్టయిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.కేంద్ర మంత్రి నీళ్లుమింగే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. నాగేశ్వర్‌రావు కామెంట్లు రాష్ట్ర సాగునీటి శాఖలోనూ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే తమ పరిస్థితి ఎంటనే ఆందోళనలో వారున్నారు. ఏకంగా సీబీఐ మాజీ డైరెక్టరు చేసిన వాఖ్యలతో ఒకింత టెన్షన్‌కు గురవుతున్నట్టు సమాచారం. ఇటు కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ, ఎన్‌డిఎస్‌ఏ అధికారులే ఆలోచన చేసే అవకాశాలున్నాయి.