అధికారంలోకి వస్తే ఉచిత విద్య : కిషన్‌రెడ్డి

– బీజేపీలో చేరిన కేఎస్‌ రత్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తామనీ, పంట బీమా అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత కేఎస్‌.రత్నం ఆ పార్టీలో చేరారు. ఆయనకు కిషన్‌రెడ్డి కాషాయం కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీకేఆర్‌ మాట్లాడుతూ..గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌పార్టీ కర్నాటకను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రాహుల్‌గాంధీ హామీలు అమలు చేయాలంటే కాగితం మీద రాసినంత సులువు కాదని చెప్పారు. కాంగ్రెస్‌ అమ్ముడుపోయే పార్టీ అనీ, బీఆర్‌ఎస్‌ కొనుక్కునే పార్టీ అని ఆరోపించారు. అసవుద్దీన్‌ ఓవైసీ రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్‌, కేసీఆర్‌ చదువుతారని విమర్శించారు. మజ్లిస్‌తో దోస్తానా ఉన్న బీఆర్‌ఎస్‌తో కలిసిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్‌ కేసీఆర్‌ కుటంబ భవన్‌ అయిందని విమర్శించారు. కేఎస్‌.రత్నం మాట్లాడుతూ.. తనకు ఏడు నెలల పదవీ కాలమున్నా రాజీనామా చేసి జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావంలో పాలుపంచుకున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశానన్నారు. తాను గట్టిగా మాట్లాడే వ్యక్తిని కాబట్టే పదవులు రాలేదని భావిస్తున్నానని చెప్పారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..తనను కాంగ్రెస్‌లోకి రమ్మన్నా వెళ్లట్లేదని చెప్పారు. చేవెళ్లతో తమకు కాంగ్రెస్‌తోనే పోటీ అన్నారు. రాష్ట్ర కేంద్రంలో ఒక కుటుంబ పాలన ఉంటే, చేవెళ్లలో మరో కుటుంబ పాలన నడుస్తున్నదని విమర్శించారు. కేఎస్‌. రత్నంను దగ్గరి గెలిపిస్తానని చెప్పారు.