కిష్టాపూర్ పాఠశాల ఆత్మఘోష 

Kishtapur school chant– ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ స్కూలు మొగ్గు
– దీనస్థితిలో విద్యార్థులు..పట్టించుకోని విద్యాశాఖ
నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్)
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల అభివృద్ధి కోసం కృషి వస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఉపాధ్యాయ ఇష్టారాజ్యం కారణంగా ప్రభుత్వ పాఠశాల దయనీయంగా మారింది. ప్రభుత్వ జీతం తీసుకుంటూనే ప్రైవేటు పాఠశాలలకు మొగ్గు చూపుతున్నారని ఆరోపణ జోరుగా ఉంది. బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల సమస్యలతో సతమతమవుతుంది. పాఠశాల సమస్య ఎవరికి చెప్పుకోలేని  దయనీయమైన  పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం 170 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 150 మంది విద్యార్థులు ఉన్నారని తెలిసింది. గత సంవత్సరం కన్న ఈ సంవత్సరం 20 మంది విద్యార్థులు తక్కువ అయ్యారు. కారణం ఒక్కటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు  ప్రవేట్ పాఠశాలలు ఉండడమే కారణం. కిష్టాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల గదులు లేక ఉపాధ్యాయులు పిల్లలను వరండాలో చదివిస్తున్నారు. పాఠశాలలో 150 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి త్రాగునీరు లేక ఇంటి నుంచి త్రాగునీరు తెచ్చుకుంటున్నారు. మరుగుదొడ్లు సక్రమంగా లేక బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో 8 తరగతి ఉండగా ఇందులో ఐదు గదులు మాత్రమే పని చేస్తుండడంతో మిగతా రెండు, మూడు తరగతులు వరండా లో కూర్చుండబెట్టి విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థులకు గదులు లేకపోవడంతో నూతనంగా మరో నాలుగు గదులు నిర్మించినప్పటికీ నూతన భవనంలో పనులు పూర్తిగా కాకపోవడం విద్యార్థులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పాఠశాల కొద్దిపాటి వర్షాలకే పాఠశాల భవనాలతోపాటు పాఠశాల ఆవరణలో సైతం వర్షపు నీరు చేరుతుండడంతో విద్యా ర్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.  పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్వహణ శాపంగా మారింది. నిర్మాణ పనుల్లో అసంపూర్తిగా ఉన్న చాలా పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లు సైతం నిరుపయోగంగానే ఉన్నాయి. పాఠశాలల ఆవరణలో ఆడుకునేందుకు విద్యార్థులకు సరైన వసతులు, సామగ్రి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రవేట్ కు సై ..  ప్రభుత్వానికి నై: ప్రభుత్వ జీతం తీసుకుంటూనే ప్రవేట్ పనులా..?
కిష్టాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్న లత  గత రెండు రోజులుగా పాఠశాలకు రావడంలేదని అదే పాఠశాలకు చెందిన గ్రామస్తులు, విద్యార్థులు కొందరు తెలిపారు. ఈ విషయంలో బీర్కూర్ హైస్కూల్ క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయుడు వెంకన్నకు వివరణ కోరగా కిష్టాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్న లత సెలవు పెట్టలేదని, గత రెండు రోజులుగా విధుల్లో ఉందంటూ వివరణ ఇచ్చారు. కాని గత రెండు రోజులుగా పాఠశాలకు గైర్హాజరు అవుతూ ఆమె వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారు అంటూ గ్రామస్తులు ఆరోపించారు. కిష్టాపూర్ ప్రధాన ఉపాధ్యాయురాలు బీర్కూర్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నట్లు సమాచారం తెలిసింది. కొంతమంది ప్రభుత్వ టీచర్లు బినామీల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచాల్సిన బాధ్యతను మరచి వారికున్న పలుకుబడితో సొంత స్కూళ్లలో అడ్మిషన్లు పెంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారికి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు కూడా తోడవడంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా వీరి వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.