ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే…

Home lamp
If you kiss...దేనికదే లెక్క వుంటది. పద్ధతి పద్ధతే కానీ మన ‘ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాలిపోయినట్టు’ అంటరు. మనదే కదా అని ఇంట్లో, రాని కరెంటు పని చేస్తే ఇసిరి కొడుతది. మన మనుమడే, మన కొడుకే అని కొంచెం గీత దాటితే అంతే సంగతులు అయితయి. అందుకే ‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడు’ అంటరు. ఇల్లును సవరిచ్చేది ఇల్లాలు అనే అర్ధంలో వాడుతరు. అట్లనే ‘ఇంటి సంగతి వాకిలి చెప్పుతది’ అంటరు. ఎవరింట్లకన్న పోతే ఇల్లు అంతా అంగడి అంగడి కన్పిస్తది. వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వుంటయి. కూర్చునే కుర్చీల్లోనే సామానులు పెడుతరు. అయితే ఇట్లాంటి పనులు ఆడవాల్లే చేయాలని రూల్‌ ఏం లేదు కానీ, పితృస్వామ్య భావజాలం నుంచి పుట్టిన సామెతలు ఇట్లనే వుంటయి. అన్నట్టు ‘ఇంటింటికీ మట్టి పొయ్యి’ అనే సామెత కూడా ఇట్లనే పుట్టింది. ప్రతి ఇంట్ల ఏదో ఘర్షణ వుంటది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు సహజం. తర్వాత కలుపుకు పోతరు. భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరణ జరుగుతున్నదంటే ప్రజాస్వామిక వాతావరణం వున్నదన్నట్టు. లేదంటే నియంతృత్వమే. లొల్లులు అయితే ఈ మంట పొయ్యి సామెత వాడుతరు. ఆ కాలంలో అందరికీ మన్నుతో పొయ్యి ఉండేది. దానిపై కట్టెలతో వంట చేసుకునేవాళ్లు. ఇల్లన్నకాడ చాలా వుంటది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు వుండేది. అన్నదమ్ములు, యారాండ్లు, ఆడబిడ్డలు, తండ్రులు, తాతలు… ఇట్లా వుండేది. ఆ గుంపులలో ఎవరైనా ఏదైనా తెల్వకుంట తీయవచ్చు. అప్పుడు ఎవరు తీసిండ్రు అంటే ఎవరూ సప్పుడు చెయ్యరు. ఆ సమయంలోనే ‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టడు’ అంటరు. అట్లనే ఈ దొంగతనాల్లో క్రిమినల్‌ మనుషులు ఉన్నారనుకో అప్పుడు ‘ఇంటి దొంగ పాణగండం’ అంటరు. వీడు ఎన్నటికైనా డేంజర్‌ గాడు అనే అర్ధంలో ముందే గుర్తుపడతరు. కొందరు ‘ఇంట్ల పులి లెక్క వుంటరు. బయట పిల్లి లెక్క వుంటరు’. అంటే భార్యమీద ప్రతాపం చూపిస్తడన్నట్టు. బయటకు పోతే అయ్యా… అయ్యా… అన్నట్టు మెదలుతరు. సామెతలు గమ్మత్తుగ వున్నా వాస్తవాలే వుంటాయి.
– అన్నవరం దేవేందర్‌, 9440763479