ఇంటిలోనైనా బయటనైనా ఎవరు ఎంత ఉండాలో అంతే ఉండాలె, దగ్గెర వాళ్ళయినా దూరపు వాళ్లయినా పరిమితికి లోబడి ప్రవర్తించడమే పద్ధతి. ఉదాహరణకు ‘ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాలి పోయినయట’. ఈ దీపం ఎంత మంచిగ వెలుగుతుంది అని పోయి ముద్దు పెట్టుకుంటే మూతి కాల్చితది. పద్ధతి, ప్రవర్తన ఇంటి నుంచి మొదలు కావాలి. అందుకే ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అంటారు. నీవు ఎంత గొప్పోడివో నీ ఊర్లో ముందు తెలవాలి. ఆ తర్వాత బయట అనే సామెత పుట్టింది. ‘ఇంటింటికి మట్టి పోయ్యి’ అనే సామెత ఏందంటే, ఈ లొల్లి ఇంటింటికి ఉంటది అని అర్థం. భార్యాభర్తలు, అత్తలు కోడండ్లు ఏరుపడేదాకా అన్నదమ్ములు రపరప ఉండే ఉంటుంది. ఈ పంచాయతీ చెప్పే పెద్దలు ఈ సామెత ఉపయోగిస్తారు. తీర్పు చెప్పే పెద్దలలో చాలా సామెతలు ఊటలా వస్తాయి. ‘ఇంటి కళ ఇల్లాలే చెబుతుందయ్యా’ అని ఇంత పొడుగు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు. ‘ఇంటికి తొవ్వ కొలతలకు తవ్వ’. ఎట్లైతే కచ్చితంగా అవసరమో ఏ వ్యవహారానికైనా ఒక పద్ధతి అవసరం అని చెబుతారు. తవ్వ అంటే ధాన్యం కొలిచే కొలమానిక. ‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు’. ఇంట్లది ఇంట్లోనే మాయమైతే ఇంట్లోకి ఎవరు వచ్చారని పరిశీలన చేస్తాం. అయినా దొరకరు. అసలు దొంగ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన కూడా సెర్చ్ చేస్తేనే ఉంటాడు. అందుకే ‘ఇంటి దొంగ పాణ గండం’ అంటారు. కొన్నిచోట్ల ‘ఇంటోడు దొంగలు కలిసి నట్టు’ అనే సామెత కూడా వాడుతారు. ఊరిలో ప్రతి వ్యవహారంలోనూ సామెతలు ప్రజలే సష్టించుకున్నారు.
– అన్నవరం దేవేందర్, 9440763479