శిష్యుడు: గురువుగారూ… గురువుగారూ… అసలు విజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి? అర్జంటుగా భోదపరచండి.
గురువు: ఎందుకంత అర్జంటు. ఏం కొంపలు మీదకు వచ్చింది శిష్యా?
శిష్యుడు: మనిషిని ముందుకు నడిపించేది విజ్ఞానమేనని మీరు నాకు ఎన్నోసార్లు చెప్పారు కదా…
గురువు: అవును.
శిష్యుడు: మరైతే ధర్మం చెప్పవలసిన ధర్మాధిపతే ధర్మం తప్పి మాట్లాడితే అది విజ్ఞానం ఎలా అవుతుంది?
గురువు: ధర్మాధిపతి ఏమిటి? ధర్మం తప్పడమేమిటి? విషయం సూటిగా చెప్పు.
శిష్యుడు: ఒక వ్యక్తి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటానని మోసం చేసాడు. లైంగికంగా లొంగదీసుకున్నాడు. తీరా ఆ అమ్మాయి పెళ్ళి చేసుకోమని అడిగితే నీకు ‘కుజదోషం’ ఉన్నదని దాటవేసాడు. పాపం ఆ అమ్మాయి చేసేది ఏమీలేక, తనను పెళ్ళిపేరుతో మోసగించాడని ఆ వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో కేసుపెట్టింది. అతగాడు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించాడు. ‘ఆ అమ్మాయికి కుజదోషం ఉన్నది గనుకనే తాను వివాహం చేసుకోవడం లేదని, ఒకవేళ వివాహం చేసుకుంటే కాబోయే భర్తనైన తనకు ప్రాణగండం ఉందని’ బుకాయించాడు. ఇద్దరికి వివాహం కుదరదని అంటూ ససేమిరా వాదించాడు. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది గురువుగారూ…. కథ ఇక్కడే మలుపు తిరిగింది.
గురువు: ఎలా..?
శిష్యుడు: చెబుతా వినండి. అసలు ఆ అమ్మాయికి కుజదోషం ఉన్నదా? లేదా? ముందుగా తేల్చండి అంటూ లక్నో యూనివర్సిటీలో ఉన్న జ్యోతిష్య శాస్త్ర విభాగాన్ని సదరు అలహాబాదు హైకోర్టు ఆదేశించింది. ఆ అమ్మాయి జాతక చక్రాన్ని ఆమూలాగ్రం పరిశీలించి మూడు వారాల్లో నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వమని సూచిస్తూ కేసును వాయిదా వేసింది. ఇప్పుడు నా డౌటు ఏమిటంటే… ఆ జ్యోతిష్య శాస్త్ర నివేదిక ఆధారంగా తీర్పు చెబుతారా ఏమిటీ అని..?
గురువు: జ్యోతిష్యం విశ్వవాప్తంగా ఆమోదం పొందిన విజ్ఞాన శాస్త్రం కాదు. విజ్ఞాన శాస్త్రం అంటే ఎక్కడైనా, ఏ ఖండంలోనైనా ఒకేలా అమలు జరిగేది. నిరూపితమైనది. ఆచరణ యోగ్యమైనది. ఆచరణసాధ్యమైనది. జ్యోతిష్య శాస్త్రానికి నమ్మకమే పునాది. ప్రాంతాలు, మతాలు, తెగలు ఆధారంగా అది మారిపోతుంది. అంతెందుకు ఇద్దరు పండితుల మధ్య కూడా ఒకలా ఉండదు. పాత ‘మాయాబజార్’ చిత్రంలో మనం చూడలేదా?
శిష్యుడు: అందుకే ఈ కథలో మరో ట్విస్ట్.
గురువు: ఏమిటది?
శిష్యుడు: ఈ వ్యవహారం కాస్తా విదేశీ పర్యటనలో ఉన్న మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దృష్టికి వెళ్ళింది. వెంటనే ఈ కేసును విచారించేందుకు ఓ బెంచ్ (ధర్మాసనం) ఏర్పాటు చేయమని రిజిస్ట్రీకి ఆదేశించారు. తదనుగుణంగా జస్టిస్ సుధాన్షు దూలియా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కలసి ధర్మాసనం కూడా ఏర్పడింది.
గురువు: మరింకే భేషుగ్గా ఉంది.
శిష్యుడు: వినండి గురువుగారూ… ‘ఆ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలేమిటి? ఈ కేసుకు – జ్యోతిష్య శాస్త్రానికి అసలు సంబంధం ఏమిటి? ఇది పూర్తిగా అసందర్భం. అనుచితం’ అంటూ ఆ బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది.
గురువు: నిజమేగా, ఇది ఆ అమ్మాయి వ్యక్తిగత గోప్యత (ప్రైవెసీ) హక్కుకు భంగం కూడా…
శిష్యుడు: ధర్మాసనం కూడా అదే తెలిపిందండీ గురువు గారూ…కానీ కిందపడ్డా తమదే గెలుపు అని వాదించే మొండి ఘటాలు ఉంటాయిగా… జ్యోతిష్యశాస్త్రం కూడా ఓ విజ్ఞాన శాస్త్రమే అని వారు గుడ్డిగానే వాదిస్తున్నారు. ఇరు పక్షాల అంగీకారంతోనే ఆ అలహాబాదు హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని నిందితుడు తరుపు న్యాయవాది నమ్మబలుకుతున్నాడు.
గురువు: మబ్బులు మసకేసినంత మాత్రాన మండే సూర్యుడు కనిపించకపోతాడా? ఇదీ అంతే శిష్యా…
శిష్యుడు: అవునవును. అందుకే సుప్రీం కోర్టు, హైకోర్టు ఆ ఆదేశాలపై స్టే విధించింది.
గురువు: అర్థమయింది శిష్యా! ధర్మం – సత్యం ఒకే నాణానికి బొమ్మ-బొరుసు వంటివి. సత్యం కన్నా సత్య సంధత గొప్పది అని గాంధీజీ ఎప్పుడూ అంటూ ఉండేవాడు. అందుకే తన జీవిత చరిత్ర పుస్తకానికి కూడా ‘సత్యశోధన’ అని నామకరణం చేశాడు. ‘సత్యాన్వేషణే విజ్ఞాన శాస్త్రం’ అని అరిస్టాటిల్ కూడా ఏనాడో పేర్కొన్నాడు. ధర్మాసనంపైన ఉన్న అధిపతులు ఏ స్థాయిలో వారైనా సత్యశోధన పట్ల నిబద్దతతో వ్యవహరించాలి. అది వారి వృత్తి ధర్మం కూడా. అజ్ఞానం అంటే అంధకారం, చీకటి. విజ్ఞానం అంటే వెలుగు. ‘తమసోమా జ్యోతిర్గమయా’ అంటే చీకటి నుండి వెలుగుకు మానవ జీవన పయనం.
విశ్వ రహస్యాలను మానవ జాతి సాధించిన విజయాలను శాస్త్రీయ దృక్పథంతో క్రమబద్దంగా అధ్యయనం చేయడం, అవగాహన పెంపొందించుకోవడమే విజ్ఞాన సముపార్జన. అదే మనిషిని ముందుకు నడుపుతుంది. మానవ జాతి పురోగతి అంటే అదే. అలా గాక నమ్మకాల మీద ఆధారపడే జ్యోతిష్యం, వాస్తు, క్షుద్రపూజలు ఏవైనా మనిషిని ముందుకు నడపవు సరి కదా ఒక్కోసారి వెనక్కి నడిపిస్తాయి. అగాధంలోకి పడేస్తాయి కూడా… ఇదీ అంతే.
కె. శాంతారావు
9959745723