జలదిగ్భందంలో కోహెడ

Koheda in watershed– సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి
– నీటి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ మనుచౌదరి, సీపీ అనురాధ
నవతెలంగాణ – కోహెడ
కోహెడ మండల కేంద్రంలో అధిక వర్షాలతో బాదుగుల చెరువు పూర్తిగా నిండి అలుగు పడడంతో బుధవారం బంధం ఏరియాలో ఉన్న ఇండ్లలోకి నీరు చేరుకొని ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోన్నారు. డ్రైనేజీ పూర్తిగా నిండిపోయి ఇండ్లలోకి నీరు చేరుకోవడంతో సమాచారం తెలుసుకున్న కలెక్టర్‌ ఎం.మనుచౌదరి, సీపీ అనురాధ చేరుకొని బాధితులతో  మాట్లాడి భరోసా కల్పించారు. వర్షాపాతానికి దెబ్బతిన్న ఇంటింటికి తిరుగుతూ బాధితులతో మాట్లాడారు. అలాగే అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇండ్ల వివరాలను త్వరితగతిన అందించాలని, గ్రామపంచాయితి సిబ్బందితో కలిసి గ్రామంలో, పరిసర ప్రాంతాలలో నిలిచిన నీటిని జెసీబీతో కాలువతీసి నీటి తీవ్రతను తగ్గించాలని సూచించారు. కాలువలలో ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ళపొదలను చదును చేయించి ప్రజలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ఫాగింగ్‌, నిలువ నీళ్ళలో ఆయిల్‌బాల్స్‌ వేయాలని, నాలాలపై అక్రమ నిర్మాణాలను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే అతి వర్షాలతో చెడిపోయిన డ్రైనేజీని పరిశీలించి వెడల్పు, లోతు చేయడం సంబంధిత పనులకు ప్రతిపాదనలు పంపాలని పంచాయితీరాజ్‌ ఇంజనీర్‌, తహాశీల్దార్‌ సురేఖ, ఎంపీవో శోభలను ఆదేశించారు. అలాగే వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున వాటిని పట్టించి జిల్లా కేంద్రంలో ఉన్న ఎనిమల్స్‌ బర్త్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆపరేషన్‌ చేయించి వదిలిపెట్టాలని గ్రామపంచాయితి అధికారులను ఆదేశించారు. బాదుగుల చెరువు నుంచి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలాను పూర్తిగా నిర్మించుటకు, ఇదివరకు ఉన్న వాల్‌కు రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంచడం, లోతు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. ఆయన వెంట హుస్నాబాద్‌ ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ వాసాల సతీష్‌, ఎంపీడీవో కృష్ణయ్య, తహాశీల్దార్‌ సురేఖ, ఎంపీవో శోభ, ్గఎస్సై అభిలాష్‌, ఇరిగేషన్‌శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.