ఉప్పల్‌, విశాఖ టెస్టులకు కోహ్లి దూరం

Kohili – వ్యక్తిగత కారణాలతో జట్టును వీడిన విరాట్‌
ముంబయి : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సవాల్‌కు సిద్ధమవుతుండగా.. ఆతిథ్య భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్‌ బ్యాటర్‌, టెస్టు జట్టులో కీలక ఆటగాడు విరాట్‌ కోహ్లి తొలి రెండు మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఉప్పల్‌, విశాఖ టెస్టులకు అందుబాటులో ఉండలేనని బీసీసీఐకి సమాచారం అందించాడు. తొలి టెస్టు కోసం ఆదివారమే హైదరాబాద్‌కు చేరుకున్న విరాట్‌ కోహ్లి సోమవారం జరిగిన ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరు కాలేదు. కోహ్లి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జట్టు మేనేజ్‌మెంట్‌, సెలక్టర్లతో విరాట్‌ కోహ్లి మాట్లాడారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించటమే తన అత్యంత ప్రాధాన్య అంశమని.. కానీ కొన్ని వ్యక్తిగత పరిస్థితులు కుటుంబంతో ఉండాల్సిన స్థితిని కలిగించాయని’ కోహ్లి మాటలను బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. విరాట్‌ కోహ్లి స్థానం కోసం చతేశ్వర్‌ పుజార, రజత్‌ పటీదార్‌, అభిమన్యు ఈశ్వరన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ సహా తెలుగు తేజం తిలక్‌ వర్మ పోటీపడుతున్నారు. జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కొనసాగుతున్నారు. వికెట్‌ కీపర్‌గా కె.ఎస్‌ భరత్‌, ధ్రువ్‌ జురెల్‌లలో ఒకరికి అవకాశం కల్పిస్తే.. కెఎల్‌ రాహుల్‌ మిడిల్‌ ఆర్డర్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా చోటు సాధించే అవకాశం ఉంది. భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ జనవరి 25న హైదరాబాద్‌ టెస్టుతో ఆరంభం కానుంది. 2025 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా.. టీమ్‌ ఇండియా రెండో స్థానంలో కొనసాగుతుంది.